
కొందరు ప్రపంచ కార్పొరేట్ లీడర్ల జీవన శైలి భిన్నంగా ఉంటుంది. ప్రముఖ కాఫీ చైన్ స్టార్ బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్ వ్యక్తిగత శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన నివాసం కాలిఫోర్నియాలో ఉంటుంది. సియాటెల్లోని కంపెనీ కార్యాలయానికి నిత్యం దాదాపు 1,600 కిలోమీటర్లు ఆయన కార్పొరేట్ జెట్లో తిరిగేవారు. అయితే ఆయన ఇప్పుడు సియాటెల్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు ఫార్చ్యూన్ వార్తా కథనం తెలిపింది. దీనికి కారణం ఆ కంపెనీ తీసుకొచ్చిన కొత్త విధానమే.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ కాఫీ చైన్ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు తీసుకురావడానికి కఠినమైన విధానాన్ని అమలు చేస్తోంది. "మనం కలిసి పనిచేస్తే దాన్ని ఉత్తమంగా చేయగలం. ఆలోచనలను మరింత సమర్థవంతంగా పంచుకోగలం. కఠినమైన సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించుకుని వేగంగా ముందుకు వెళ్లగలం. అందుకే మన ఇన్-ఆఫీస్ సంస్కృతిని పునరుద్ధరిస్తున్నాము" అని నికోల్ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు.
గత ఏడాది ఆగస్టులో స్టార్ బక్స్ సీఈఓగా నికోల్ నియమితులైనప్పుడు, కంపెనీ ఆయన ప్రత్యేక ప్రయాణ ప్రణాళికకు అంగీకరించింది. సియాటెల్ కార్యాలయానికి వారానికి కనీసం మూడు రోజులు వచ్చేలా కాలిఫోర్నియా- సియాటెల్ మధ్య కార్పొరేట్ జెట్లో ప్రయాణించే వెసులుబాటును కంపెనీ కల్పించింది. ఇది ఆ సమయంలో కంపెనీ అనుసరిస్తున్న హైబ్రిడ్ వర్క్ పాలసీకి అనుగుణంగా కల్పించిన వెసులుబాటు. నికోల్ ఇలాంటి రొటీన్ ఫాలో అవడం ఇదే మొదటిసారి కాదు. 2018లో చిపోటిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాంటి సుదూర ప్రయాణ ఏర్పాట్లు చేశారు. తర్వాత తన లొకేషన్ కు దగ్గరయ్యేలా కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని కూడా డెన్వర్ నుంచి కాలిఫోర్నియాకు మార్చాడు.
కానీ ఇప్పుడు స్టార్ బక్స్ లో పరిస్థితులు మారుతున్నాయి. అక్టోబర్ నుంచి కార్పొరేట్ ఉద్యోగులందరూ వారంలో కనీసం నాలుగు రోజులు ఆఫీసులో ఉండాలని నికోల్ సిబ్బందికి సూచించారు. కంపెనీ తిరిగి పుంజుకునేందుకు ప్రారంభించిన "బ్యాక్ టు స్టార్ బక్స్" ప్రణాళికలో ఇది భాగం. గత ఏడాదిలో, స్టార్ బక్స్ అమ్మకాలు పడిపోవడం, అంతర్గత మార్పులతోపాటు బ్రాండ్ కు సంబంధించిన నిరసనలను కూడా చూసింది. ఈ నేపథ్యంలో వర్క్ పాలసీని సవరించిన స్టార్ బక్స్ సపోర్ట్ సెంటర్ నుండి రిమోట్ గా పనిచేస్తున్న మేనేజర్లు, టీమ్ లీడర్లు సియాటెల్ లేదా టొరంటోకు మారడానికి 12 నెలల సమయం ఇచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో ఏదో చోటకు నివాసం మార్చుకోవాలని ఇదివరకే గత ఫిబ్రవరీలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్లను కోరింది.
అయితే అందరూ మకాం మార్చేందుకు సిద్ధపడకపోవచ్చు అందుకే అలాంటి వారి కోసం కంపెనీ ఓ అవకాశం కల్పించింది. అదేమిటంటే కంపెనీ చెప్పినట్లు రీలొకేట్ కావడానికి సిద్ధంగా లేనివారు కంపెనీ నుంచి స్వచ్ఛందంగా వైదొలగవచ్చు. ఇందుకోసం వన్-టైమ్ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ను ప్రకటించింది. దీని ప్రకారం కంపెనీ నుంచి వైదొలగేవారికి నగదు పరిహారం చెల్లిస్తారు. ఆయన వేతన పారితోషికం పరిమాణం కారణంగా నికోల్ నియామకం ఇప్పటికే వార్తల్లో నిలిచింది. స్టార్ బక్స్ ఆయనకు సుమారు 113 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇది అతన్ని అత్యధిక పారితోషికం తీసుకునే కార్పొరేట్ లీడర్లలో ఒకరిగా చేసింది. మాజీ చైర్మన్, సీఈవో లక్ష్మణ్ నరసింహన్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
కాగా స్టాక్ బక్స్ సీఈవో నికోల్ జెట్ ప్రయాణాన్ని విడిచి సియాటెల్లో ఇల్లు కొనుక్కోవడం ఆయన్ను కంపెనీ ప్రధాన కార్యాలయానికి దగ్గర చేయడమే కాకుండా పర్యావరణానికి మేలు చేస్తుంది. అదెలా అంటే.. ఆయన జెట్ ప్రయాణం సుదీర్ఘమైనది మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా హాని చేస్తోంది. యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ప్రకారం.. ఒక ప్రైవేట్ జెట్ ప్రయాణించిన ప్రతి కిలోమీటరుకు సుమారు 2.5 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. కాలిఫోర్నియా- సియాటెల్ మధ్య 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 8,000 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. నికోల్ వారానికి మూడుసార్లు తిరిగితే మొత్తం వార్షిక ఉద్గారాలు 1,152 మెట్రిక్ టన్నులుగా ఉంటాయి. వారంలో ఐదు రోజులు తిరిగే ఆ సంఖ్య 1,920 మెట్రిక్ టన్నులకు చేరుతుంది.