దక్షిణ కొరియాలోని ఆర్థిక రంగాన్ని భారీ హ్యాకింగ్ సైబర్ దాడి వణికించింది. దేశంలోని మొత్తం 16 ఆర్థిక సంస్థలపై హ్యాకింగ్ దాడులు జరిగినట్లు ఆ దేశ ఆర్థిక రంగ నియంత్రణ సంస్థ ‘ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్’ (ఎఫ్ఎస్సీ) అధికారికంగా వెల్లడించింది. ఈ హ్యాకింగ్ దాడులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఏమైనా ఉపయోగించారా అనే కోణంలో ఆర్థిక, భద్రతా అధికారులు విచారణ వేగవంతం చేశారు.
మారుతున్న సాంకేతికతతో ఏఐ ఆధారిత సైబర్ దాడులు పెరిగే ముప్పు ఉండటంతో ఎఫ్ఎస్సీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. బాధ్యులైన హ్యాకర్ల ముఠాను గుర్తించేందుకు, డేటా చోరీ తీరును విశ్లేషించేందుకు నిపుణులు ముమ్మరంగా పని చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సైబర్ ప్రమాదాలను త్వరితగతిన పసిగట్టేందుకు, ఉమ్మడి ప్రతిస్పందన చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ ప్రకటించింది. ఈ దాడుల వల్ల కంపెనీలు ఏమేరకు ప్రభావితం చెందాయనే అంశాలను మాత్రం ఎఫ్ఎస్సీ వెల్లడించలేదు.
అంతేకాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థిక సంస్థల్లో భద్రతా తనిఖీలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. డిజిటల్ బ్యాంకింగ్, సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడే ఆర్థిక రంగంపై జరిగిన ఈ ఊహించని దాడి ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని మరోసారి నొక్కిచెప్పింది.
ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్.. ఇదే మంచి ఛాన్స్!


