భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే! | Smartphones Laptops to Get More Expensive As AI Effect | Sakshi
Sakshi News home page

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

Jun 22 2026 4:48 PM | Updated on Jun 22 2026 5:06 PM

Smartphones Laptops to Get More Expensive As AI Effect

కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు దీని ప్రభావం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోళ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ధరలపై కూడా పడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

గ్లోబల్ మార్కెట్లో ఏఐ అభివృద్ధికి అవసరమైన మెమరీ, స్టోరేజ్ చిప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వాటి కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితి కారణంగా.. భవిష్యత్తులో గాడ్జెట్‌ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఏఐ మోడళ్ల శిక్షణ, నిర్వహణ కోసం భారీ స్థాయిలో మెమరీ చిప్‌లు అవసరమవుతున్నాయి. ఈ చిప్‌లను స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోళ్లు వంటి పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుతం.. ఈ మార్కెట్‌ను ఎస్కే హైనిక్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రాన్ వంటి సంస్థలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కాగా.. ఏఐ కంపెనీల భారీ కొనుగోళ్లతో చిప్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి.

మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ధరలు పెరగనున్నట్లు టిమ్ కుక్ ఇప్పటికే ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే చిప్‌ల ఖర్చు నాలుగు రెట్లు పెరిగిందని, ఈ భారాన్ని కంపెనీలు భరించడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చులో 8 నుంచి 12 శాతం వరకు మెమరీ చిప్‌ల కోసం ఖర్చు చేస్తున్నారు. డిమాండ్-సప్లై అసమతుల్యత కారణంగా తయారీదారులు ఉత్పత్తుల ధరలను పెంచడం తప్ప మరో మార్గం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారతీయ వినియోగదారులకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా తగ్గుతుండటంతో, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చిప్‌ల ఖర్చు మరింత పెరుగుతోంది. దీంతో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరలపై అదనపు భారం పడుతోంది.

రాబోయే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చిప్ తయారీ సంస్థలు, తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నప్పటికీ, కొత్త తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు చిప్‌ల కొరత కొనసాగవచ్చని, ఫలితంగా గాడ్జెట్‌ల ధరలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో గ్యాడ్జెట్స్ ధరలు పెరగనున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement