
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీల లిస్టింగ్ సన్నాహాలకు ఓకే చెప్పింది. జాబితాలో రైట్ వాటర్ ల్యూషన్స్(ఇండియా), వీడా క్లినికల్ రీసెర్చ్, ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్, శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర, సీడ్‌వర్క్స్ ఇంటర్నేషనల్ చేరాయి. ఈ ఐదు కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు వీలుగా 2025 జనవరి–ఫిబ్రవరి మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. మరోపక్క ఈ ఏడాది మార్చిలో వియ్ వర్క్ ఇండియా మేనేజ్‌మెంట్ ఇష్యూపై నిర్ణయాన్ని పక్కనపెట్టిన సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెరసి ఆరు కంపెనీల నిధుల సమీకరణకు లైన్ క్లియరైంది. వివరాలు చూద్దాం..
ఎంబసీ గ్రూప్ దన్ను
ప్రీమియం, ఫ్లెక్సిబుల్ కార్యాలయాల నిర్వహణ సంస్థ వియ్ వర్క్ ఇండియా మేనేజ్‌మెంట్ పబ్లిక్ ఇష్యూకి అనుమతి లభించింది. ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేసిన కంపెనీ ఐపీవోలో భాగంగా 4.37 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు.
క్లీన్ టెక్ కంపెనీ
వాటర్ యాక్సెస్ యాక్సెలరేషన్ ఫండ్ ఎస్‌ఎల్‌పీకి పెట్టుబడులున్న క్లీన్ టెక్ సంస్థ రైట్ వాటర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 445 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 745 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 225 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.
ఆభరణాల తయారీ
జ్యువెలరీ తయారీ కంపెనీ శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ఐపీవోకు సెబీ అనుమతించడంతో 2.43 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 250 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. ఈ బాటలో సీడ్‌వర్క్స్ ఇంటర్నేషనల్ సైతం లిస్టింగ్ సన్నాహాలు ప్రారంభించనుంది. దీనిలో భాగంగా కంపెనీలో ప్రస్తుత ఇన్వెస్టర్లు 5.19 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈ కంపెనీలన్నీ ఐపీవో ద్వారా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యే యోచనలో ఉన్నాయి.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవలు
ఈపీసీ కంపెనీ ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించడంతో లిస్టింగ్ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు సైతం 2.29 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
క్లినికల్ రీసెర్చ్ సంస్థ
ప్రధానంగా క్లినికల్ రీసెర్చ్ కార్యకలాపాలు సమకూర్చే గుజరాత్ కంపెనీ వీడా క్లినికల్ రీసెర్చ్ ఐపీవోకు రెడీ అవుతోంది. ఇందుకు వీలుగా రూ. 185 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.3 కోట్ల షేర్లను ప్రమోటర్, ఇతర వాటాదారులు ఆఫర్ చేస్తారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ కొనుగోలుతోపాటు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.