నెఫ్రోకేర్‌ ఐపీవోకి సెబీ ఓకే.. | SEBI Approves IPO Plans of Nephrocare Health Services and Clean Max Enviro Energy Solutions | Sakshi
Sakshi News home page

నెఫ్రోకేర్‌ ఐపీవోకి సెబీ ఓకే..

Nov 11 2025 4:21 AM | Updated on Nov 11 2025 4:21 AM

SEBI Approves IPO Plans of Nephrocare Health Services and Clean Max Enviro Energy Solutions

క్లీన్‌ మ్యాక్స్‌ ఇష్యూకి కూడా ఆమోదం 

రెండు ఇష్యూల పరిమాణం రూ. 5,553 కోట్లు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డయాలిసిస్‌ సేవల సంస్థ నెఫ్రోకేర్‌ హెల్త్‌ సరీ్వసెస్, పునరుత్పాదక విద్యుత్‌ సేవల సంస్థ క్లీన్‌ మ్యాక్స్‌ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్‌ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. ఈ రెండు సంస్థలు మొత్తం రూ.5,553 కోట్లు సమీకరించనున్నాయి. 

ఇరు కంపెనీలు సెబీకి ఆగస్టులో ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేయగా .. అక్టోబర్, నవంబర్‌లో సెబీ నుంచి క్లియరెన్సులు వచ్చాయి. ప్రాస్పెక్టస్‌ల ప్రకారం నెఫ్రోప్లస్‌ బ్రాండ్‌ పేరిట సేవలందించే నెఫ్రోకేర్‌ హెల్త్‌ తాజా షేర్ల జారీ ద్వారా రూ. 353.4 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో 1.27 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీతో సమీకరించిన నిధుల్లో రూ. 129.1 కోట్లను కొత్త డయాలిసిస్‌ క్లినిక్‌లను ప్రారంభించేందుకు, రూ. 136 కోట్ల మొత్తా న్ని రుణాలను చెల్లించివేసేందుకు, ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.   

క్లీన్‌ మ్యాక్స్‌ ఐపీవో రూ. 5,200 కోట్లు.. 
ప్రాస్పెక్టస్‌ ప్రకారం క్లీన్‌ మ్యాక్స్‌ రూ. 5,200 కోట్లు సమీకరించనుంది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమకూర్చుకోనుండగా, ప్రమోటర్లు..ఇతర ఇన్వెస్టర్లు ఓఎఫ్‌ఎస్‌ విధానంలో రూ. 3,700 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. రూ. 1,125 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపునకు, మిగతాది ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2010లో ప్రారంభమైన క్లీన్‌ మ్యాక్స్‌ పారిశ్రామిక కస్టమర్లకు సౌర, పవన, హైబ్రిడ్‌ విద్యుత్‌ సరఫరా సేవలు అందిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement