
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి ‘ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జూమర్ బ్యాంక్’ గుర్తింపు దక్కించుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 18న అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సులో ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ వృద్ధి వ్యూహానికి కీలకమని శెట్టి తెలిపారు. ఆన్–బోర్డింగ్‌ను సరళతరం చేయడం, ప్రాంతీయ భాషల్లో వాయిస్ బ్యాంకింగ్‌లాంటి కొత్త ఆవిష్కరణలతో 52 కోట్ల పైగా కస్టమర్లకు ప్రపంచ స్థాయి సర్వీసులు అందిస్తున్నామని పేర్కొన్నారు. 24/7 డిజిటల్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో సేవలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310.. ధర ఎంతంటే..
కృత్రిమ మేధస్సుతో నడిచే హైపర్-పర్సనలైజ్డ్ ఆఫర్లతో బ్యాంక్ ఓమ్ని-ఛానల్ ఎంగేజ్‌మెంట్ మోడళ్లను రూపొందిస్తోంది. యోనో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 8.77 కోట్ల మంది వినియోగదారులను ఆకర్షించింది. ఈ గుర్తింపు కేవలం ఎస్‌బీఐకి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులకు గర్వకారణమని శెట్టి తెలిపారు.