
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(79) కన్నుమూశారు. అతని ఎక్స్ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి(ఆర్ఎంఎల్)లో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆర్కే పురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు లోధి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.
మాలిక్ 1970వ దశకంలో ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజకీయ నాయకుడిగా దాదాపు 50 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉంది. పశ్చిమ యూపీలోని బాగ్‌పట్‌కు చెందిన ఆయన మొదట చౌదరి చరణ్ సింగ్ ఆధ్వర్యంలోని భారతీయ క్రాంతి దళ్ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్‌దళ్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. కానీ 1984లో కాంగ్రెస్‌లో చేరి 1986లో రాజ్యసభకు వెళ్లారు.
ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఆయన ఏడాది కాలం పని చేశారు. గోవా, మేఘాలయ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్ మలిక్ చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఈయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్మీ జవాన్లను హెలికాప్టర్‌లో తరలించాలన్న తన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం మన్నించి ఉంటే పుల్వామా ఘటన జరిగేదే కాదని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని నెలల క్రితం జరిగిన పహల్గామ్ దాడి విషయంలోనూ ఆయన మోడీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. నిఘాలోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని, ఈ ప్రభుత్వం సిగ్గులేనిదని అంటూనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
पूर्व गवर्नर चौधरी सत्यपाल सिंह मलिक जी नहीं रहें।#satyapalmalik
— Satyapal Malik (@SatyapalMalik6) August 5, 2025
జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత 2024లో మాలిక్ నివాస స్థలంతోపాటు సుమారు 30 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. అయితే ఇందులో రూ.21 లక్షల నగదును, కొన్ని డిజిటల్ పరికరాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. లంచం తీసుకున్న కేసులో ప్రశ్నించేందుకు హాజరు కావాల్సిందిగా సీబీఐ ఆదేశించింది కూడా. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని మాలిక్ స్పష్టం చేశారు. గవర్నర్‌గా ఉండగా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే విషయంలో తనకు రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని మాలిక్ ఆరోపించారు. ఈ ఏడాది మే నెలలో సీబీఐ మాలిక్‌తోపాటు మరో ఐదుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సుమారు రూ.2200 కోట్ల సివిల్ కాంట్రాక్ట్‌ల జారీ విషయంలో అక్రమాలు జరిగాయన్నది ఆయనపై సీబీఐ చేసిన ఆరోపణ.