సత్యం రామలింగరాజుతోపాటు ఆ నలుగురికి రూ.624 కోట్లు లాభం.. | Sakshi
Sakshi News home page

సత్యం రామలింగరాజుతోపాటు ఆ నలుగురికి రూ.624 కోట్లు లాభం..

Published Sat, Dec 2 2023 8:34 AM

Satyam Ramalingaraju And Another Four Members Gained Of Rs 624 Cr - Sakshi

సత్యం కంప్యూటర్స్‌ కంపెనీ ఆదాయ, వ్యయాలకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపించినట్లు అప్పటి సంస్థ ఛైర్మన్‌ రామలింగరాజు అంగీకరించిన విషయం తెలిసిందే. 2001 జనవరి నుంచి 2008 డిసెంబరు మధ్యకాలంలో కంపెనీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా రామలింగరాజు, ఇతరులు కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టి అక్రమంగా లాభపడినట్లు సెబీ తెలిపింది. 

అయితే సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌  ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా(సెబీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్‌ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులు  రూ.624 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించింది. ఆ సొమ్మును వడ్డీతో సహా వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ నలుగురిలో రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్‌, జి.రామకృష్ణ ఉన్నారు. దీంతోపాటు రామలింగరాజుకు చెందిన ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు కూడా ఈ కేసులో భాగంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సెబీ 96 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం రూ.624 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల ఈ సొమ్మును 2009 జనవరి 7వ తేదీ నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.

2018 అక్టోబరు, నవంబరులో సెబీ ఇచ్చిన రెండు ఉత్తర్వుల్లో రామలింగరాజు, ఆయన సహచరులు అక్రమంగా ఏ మేరకు లబ్ది పొందారో తెలిపింది. ఆ ఉత్తర్వులను  సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(శాట్‌) ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపేసింది. ఈ వ్యవహారాన్ని మళ్లీ మొదటి నుంచి పరిశీలించి తాజా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. అందుకు ఈ ఏడాది నవంబరు 30వ తేదీని గడువుగా నిర్దేశించింది. దీన్ని అనుసరించి సెబీ కొత్త ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది.

ఇదీ చదవండి: వాట్సాప్‌ న్యూ సీక్రెట్‌ ఫీచర్‌.. ఎలా సెట్‌ చేయాలంటే?

కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించడంతో పాటు గతంలో అనుసరించిన నియమాలను సైతం పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు సెబీ డైరెక్టర్‌ అనంత్‌ నారాయణ్‌ తెలిపారు. సత్యం ఖాతాల కుంభకోణం వెలుగు చూసిన తర్వాత రామలింగరాజు, రామరాజులను సెక్యూరిటీస్‌ మార్కెట్లో 2028 జూన్‌ 14 వరకు కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ నిషేధించింది. అయితే ఈ ఉత్తర్వుల్లో అంశాల అమలు ప్రక్రియ సుప్రీంకోర్టులోని అప్పీళ్లపై వెలువడే తీర్పులను బట్టి ఉంటుదని తెలుస్తోంది.

గతంలో సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యూనల్ సూచనల మేరకు సెబీ రామలింగరాజు, ఇతరులకు 14 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఎలాంటి మార్కెటింగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని పేర్కొంది. కాగా, అప్పటికే ఆదేశించిన రూ.1258.88 కోట్ల మొత్తాన్ని రూ.813.40 కోట్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. ఇందులో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ కంపెనీ రూ.675 కోట్లు, రామలింగరాజు రూ.27కోట్లు, సూర్య నారాయణరాజు 82 కోట్లు, రామరాజు రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన 2009 జనవరి నుంచి వడ్డీతో సహా చెల్లించాలని తీర్పులో పేర్కొంది.

అయితే రామలింగరాజు, ఇతరులను 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో సెబీ సహేతుకంగా వివరించలేకపోయినట్లు సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(శాట్‌)  పేర్కొంది. అందువల్ల మళ్లీ కొత్త ఉత్వర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. షేర్ల లావాదేవీల్లో పొందిన లబ్ధిని కూడా తిరిగి లెక్కించాలని ఆదేశించింది. అనంతరం రామలింగరాజును సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి 14 ఏళ్ల పాటు నిషేధిస్తూ సెబీ ఇచ్చిన ఉత్తర్వులను శాట్‌ నిలుపుదల చేసింది. ఈ వివాదాన్ని మళ్లీ పరిశీలించి, కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. దాంతో తాజాగా సెబీ శాట్‌కు అన్ని వివరాలతో నివేదించింది.

ఇదీ చదవండి: రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు!

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో 1987లో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభించిన సత్యం కంప్యూటర్స్ అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బిల్ గేట్స్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన రామలింగరాజు అంతే స్థాయిలో దిగజారిపోయారు. సత్యం కుంభకోణం అప్పుడు ఓ సంచలనంగా మారింది. ఎన్నో వాయిదాల అనంతరం సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజు, అతని సోదరులు రామరాజు, సూర్య నారాయణ రాజు తదితరులకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. సెబీ ఆయన కంపెనీలపై నిషేధం విధించింది. వేలాది మంది ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన బాటపట్టారు. ఇదంతా జరిగి దాదాపు పద్నాలుగేళ్లు కావస్తుంది. ఇప్పటికీ వారి నుంచి ఎలాంటి నష్టపరిహారాన్ని రికవరీ చేయలేదని పలువులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement