రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు!

RBI Says Rs 9760 Crores Of Rs 2000 Notes Still With People - Sakshi

భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ రూ.2000 నోట్లను తిరిగి  బ్యాంకులు సేకరించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చలామణీలో ఉన్న 97.26 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చేశాయని ఆర్‌బీఐ వెల్లడించింది.

రూ.2 వేల నోటును ఉపసంహరించుకుని ఆరు నెలలు దాటినప్పటికీ.. రూ.9,760 కోట్లు విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. రూ.2 వేల నోటు ఇప్పటికీ లీగల్‌ టెండర్‌గా కొనసాగుతుందని ఆర్‌బీఐ మరోసారి స్పష్టం చేసింది.

రూ.2వేల విలువైన నోటును ఆర్‌బీఐ ఈ ఏడాది మే 19న ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ నిర్ణయం వెలువడే నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి/ డిపాజిట్‌కు ప్రజలకు తొలుత సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత అక్టోబర్‌ 7 వరకు ఆ గడువును పొడిగించారు. ప్రస్తుతం ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే నోట్లను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్‌ 30 నాటికి 97.26 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది.

ఇప్పటికీ రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుందని, ఆర్‌ఐబీ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను ఎక్స్ఛేంజీ/ డిపాజిట్‌ చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు చేరుకోలేనివారు రూ.2 వేలు నోట్లను పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపించొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, బేల్‌పుర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, ఛండీగడ్‌, చెన్నై, గువాహటి, జైపూర్‌, జమ్ము, కాన్పూర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పూర్‌, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top