breaking news
Satyam Computer
-
సత్యం రామలింగరాజుతోపాటు ఆ నలుగురికి రూ.624 కోట్లు లాభం..
సత్యం కంప్యూటర్స్ కంపెనీ ఆదాయ, వ్యయాలకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపించినట్లు అప్పటి సంస్థ ఛైర్మన్ రామలింగరాజు అంగీకరించిన విషయం తెలిసిందే. 2001 జనవరి నుంచి 2008 డిసెంబరు మధ్యకాలంలో కంపెనీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా రామలింగరాజు, ఇతరులు కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టి అక్రమంగా లాభపడినట్లు సెబీ తెలిపింది. అయితే సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులు రూ.624 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించింది. ఆ సొమ్మును వడ్డీతో సహా వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ నలుగురిలో రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్, జి.రామకృష్ణ ఉన్నారు. దీంతోపాటు రామలింగరాజుకు చెందిన ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు కూడా ఈ కేసులో భాగంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సెబీ 96 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం రూ.624 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల ఈ సొమ్మును 2009 జనవరి 7వ తేదీ నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. 2018 అక్టోబరు, నవంబరులో సెబీ ఇచ్చిన రెండు ఉత్తర్వుల్లో రామలింగరాజు, ఆయన సహచరులు అక్రమంగా ఏ మేరకు లబ్ది పొందారో తెలిపింది. ఆ ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపేసింది. ఈ వ్యవహారాన్ని మళ్లీ మొదటి నుంచి పరిశీలించి తాజా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. అందుకు ఈ ఏడాది నవంబరు 30వ తేదీని గడువుగా నిర్దేశించింది. దీన్ని అనుసరించి సెబీ కొత్త ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇదీ చదవండి: వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే? కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించడంతో పాటు గతంలో అనుసరించిన నియమాలను సైతం పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు సెబీ డైరెక్టర్ అనంత్ నారాయణ్ తెలిపారు. సత్యం ఖాతాల కుంభకోణం వెలుగు చూసిన తర్వాత రామలింగరాజు, రామరాజులను సెక్యూరిటీస్ మార్కెట్లో 2028 జూన్ 14 వరకు కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ నిషేధించింది. అయితే ఈ ఉత్తర్వుల్లో అంశాల అమలు ప్రక్రియ సుప్రీంకోర్టులోని అప్పీళ్లపై వెలువడే తీర్పులను బట్టి ఉంటుదని తెలుస్తోంది. గతంలో సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యూనల్ సూచనల మేరకు సెబీ రామలింగరాజు, ఇతరులకు 14 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఎలాంటి మార్కెటింగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని పేర్కొంది. కాగా, అప్పటికే ఆదేశించిన రూ.1258.88 కోట్ల మొత్తాన్ని రూ.813.40 కోట్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. ఇందులో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ కంపెనీ రూ.675 కోట్లు, రామలింగరాజు రూ.27కోట్లు, సూర్య నారాయణరాజు 82 కోట్లు, రామరాజు రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన 2009 జనవరి నుంచి వడ్డీతో సహా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. అయితే రామలింగరాజు, ఇతరులను 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో సెబీ సహేతుకంగా వివరించలేకపోయినట్లు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) పేర్కొంది. అందువల్ల మళ్లీ కొత్త ఉత్వర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. షేర్ల లావాదేవీల్లో పొందిన లబ్ధిని కూడా తిరిగి లెక్కించాలని ఆదేశించింది. అనంతరం రామలింగరాజును సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 14 ఏళ్ల పాటు నిషేధిస్తూ సెబీ ఇచ్చిన ఉత్తర్వులను శాట్ నిలుపుదల చేసింది. ఈ వివాదాన్ని మళ్లీ పరిశీలించి, కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. దాంతో తాజాగా సెబీ శాట్‌కు అన్ని వివరాలతో నివేదించింది. ఇదీ చదవండి: రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు! ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో 1987లో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభించిన సత్యం కంప్యూటర్స్ అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బిల్ గేట్స్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన రామలింగరాజు అంతే స్థాయిలో దిగజారిపోయారు. సత్యం కుంభకోణం అప్పుడు ఓ సంచలనంగా మారింది. ఎన్నో వాయిదాల అనంతరం సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజు, అతని సోదరులు రామరాజు, సూర్య నారాయణ రాజు తదితరులకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. సెబీ ఆయన కంపెనీలపై నిషేధం విధించింది. వేలాది మంది ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన బాటపట్టారు. ఇదంతా జరిగి దాదాపు పద్నాలుగేళ్లు కావస్తుంది. ఇప్పటికీ వారి నుంచి ఎలాంటి నష్టపరిహారాన్ని రికవరీ చేయలేదని పలువులు అభిప్రాయపడుతున్నారు. -
సత్యం కేసులో సెబీ తీర్పు
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్ స్కాం కేసులో పాక్షిక మార్పులతో కూడిన తీర్పును సెబీ వెలువరించింది. దీని ప్రకారం కంపెనీ మాజీ సీఎఫ్‌వో వడ్లమూడి శ్రీనివాస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ జి.రామకృష్ణపై ఏడేళ్ల పాటు, ఇంటర్నల్ ఆడిట్ మాజీ హెడ్ వి.ఎస్.ప్రభాకర గుప్తాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ కాలంలో వారు సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనే వీలుండదు. ఇప్పటికే కొనసాగుతున్న నిషేధ కాలంతో కలిపి ఈ పీరియడ్ ఉంటుంది. అలాగే అక్రమంగా ఆర్జించినందుకుగాను శ్రీనివాస్ రూ.15.65 కోట్లు, రామకృష్ణ రూ.11.5 కోట్లు, గుప్తా రూ.48 లక్షలు జరిమానా కింద స్కాం బయటపడ్డ 2009 జనవరి 7 నాటి నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశాలు వెలువరించింది. ముగ్గురిపై 14 ఏళ్ల నిషేధంతోపాటు శ్రీనివాస్, రామకృష్ణ, గుప్తాపై వరుసగా రూ.29.5 కోట్లు, రూ.11.5 కోట్లు, రూ.51.26 లక్షల జరిమానా చెల్లించాలని 2014 జూలైలో సెబీ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఈ ముగ్గురు సవాల్ చేశారు. -
రాజుకు ఏడేళ్ల జైలు
⇒ రాజు సోదరులకు చెరో రూ. 5 కోట్లకు పైగా జరిమానా ⇒ ప్రత్యేక కోర్టు జడ్జి చక్రవర్తి తీర్పు ⇒ ఇది లోతైన కుట్రతో కూడిన తీవ్రమైన ఆర్థిక నేరం ⇒ కార్పొరేట్ ఖ్యాతితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీశారు ⇒ వీరి కుట్రతో మదుపుదారులు తీవ్రంగా నష్టపోయారు ⇒ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన జడ్జి ⇒ ఇలాంటి వారికి తీవ్రమైన శిక్షలు వేయాల్సిందేనని వ్యాఖ్య ⇒ చర్లపల్లి జైలుకు రాజు సహా నిందితుల తరలింపు ఈ కుట్రతో మదుపుదారులు తీవ్రంగా నష్టపోయారు. దీన్ని అంతే తీవ్రంగా పరిశీలించాలి. దేశ కార్పొరేట్ వ్యవస్థ ఖ్యాతిని, మొత్తంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఘోర నేరంగా పరిగణించాలి. న్యాయం చేయడమంటే నేరానికి తగ్గ శిక్ష వేయడమే. శిక్ష విధించేటప్పుడు కోర్టులు చూడాల్సింది నేరగాళ్లకున్న హక్కుల్ని మాత్రమే కాదు. బాధితుల హక్కుల్ని, సమాజం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. - తీర్పు సందర్భంగా జడ్జి సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందికి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి గురువారం 971 పేజీల తీర్పు వెలువరించారు. రామలింగరాజుకు రూ. 5.74 కోట్లు, రామరాజుకు రూ. 5 కోట్ల 73 లక్షల 75 వేలు జరిమానా విధించారు. మిగతా నిందితులందరికీ కలిపి రూ. 13.84 కోట్లు జరిమానాగా విధించారు. వివిధ నేరాలకు వేర్వేరుగా శిక్షలు విధించినా వాటిని ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. దీని ప్రకారం దోషులంతా గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా చెల్లించకపోతే మరికొన్ని నెలలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న కాలాన్ని మినహాయించి (సీఆర్పీసీ సెక్షన్ 428 కింద) మిగతా శిక్షా కాలాన్ని మాత్రమే దోషులు అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు ప్రతులను దోషులకు అందజేశారు. దీనిపై పైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని, అవసరమైతే లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయసహాయం పొందవచ్చని వారికి సూచించారు. విచారణలో సహకరించిన సీబీఐ స్పెషల్ పీపీ, నిందితుల తరఫు న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బందికి న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. తీవ్రమైన ఆర్థిక నేరం నిందితులపై నేరం రుజువైనట్లుగా తొలుత న్యాయమూర్తి ప్రకటించారు. ఈ నేరాల్లో గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు అపరిమితమైన జరిమానా విధించవచ్చని స్పష్టం చేశారు. శిక్ష కాలపరిమితి విధింపుపై దోషుల అభిప్రాయాలను అడిగారు. ‘‘శిక్షకాలంపై దోషుల అభిప్రాయాలను విన్నాక.. కేసులోని వాస్తవాలు, పరిస్థితులు, నేరం తీవ్రత చూశాక ఇది చాలా లోతైన కుట్రతో కూడిన ఆర్థిక నేరమని నేను భావిస్తున్నా. ఈ కుట్రవల్ల మదుపుదారులు దారుణంగా నష్టపోయారు. దీన్ని అంతే తీవ్రంగా పరిశీలించాలి. దేశ కార్పొరేట్ వ్యవస్థ ఖ్యాతిని, మొత్తంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఘోర నేరంగా పరిగణించాలి. ప్రొబేషనర్స్ ఆఫ్ అఫెండర్స్ యాక్టును పరిగణలోకి తీసుకొని శిక్షా కాలంపై ఉదాసీనత చూపించాల్సిన నేరం కాదిది. ధనుంజయ్ ఛటర్జీ అలియాస్ ధన వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లుగా... నేరగాళ్లపై తీర్పులు వెలువరించేటప్పుడు సమాజం వేదనను అర్థం చేసుకొని దానికి తగ్గ శిక్ష వేయడమే కోర్టుల ప్రతిస్పందనగా భావించాలి. న్యాయం చేయడమంటే నేరానికి తగ్గ శిక్ష వేయడమే. శిక్ష విధించేటప్పుడు కోర్టులు చూడాల్సింది నేరగాళ్లకున్న హక్కుల్ని మాత్రమే కాదు. బాధితుల హక్కుల్ని, సమాజం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి’’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. తీర్పు వింటూనే రామలింగరాజు తదితర నిందితుల బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం రాజు సహా నిందితులందరినీ గురువారం సాయంత్రం 7 గంటలప్పుడు చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. రామలింగరాజుకు 4148, రామరాజుకు 4147 నంబర్లు కేటాయించినట్టు జైలు అధికారులు తెలిపారు. ‘‘వారిద్దరినీ మానస బ్యారక్‌కు తరలించాం. మిగతావారిని అడ్మిషన్ బ్యారక్‌లో ఉంచాం. శుక్రవారం ఉదయం మరో బ్యారక్‌లోకి మారుస్తాం’’ అని తెలిపారు. బాక్సులుసెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకోవాలి ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో నిందితులు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టు విధించిన జరిమానాను చెల్లించాకే అప్పీలుకు అవకాశముంటుంది. అప్పీల్లో నేరం రుజువయ్యేదాకా శిక్ష అమలును నిలిపివేయాలని కోర్టును కోరవచ్చు. అందుకు కోర్టు అనుమతిస్తే, వారిని జైలు నుంచి బెయిలుపై విడుదల చేయాలని ఆదేశించవచ్చు. అతి పెద్ద ఆర్థిక నేరమిది: సీబీఐ స్పెషల్ పీపీ ‘‘దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరమిది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు తప్పుడు ఖాతాలు సృష్టించారు. ఖాతాలు తారుమారు చేసి మదుపుదారులను మోసం చేశారు. దోషులందరికీ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది’’అని స్పెషల్ పీపీ సురేంద్ర తెలిపారు. ‘నేర తీవ్రతతో పాటు కార్పొరేట్ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసిన తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించి దోషులకు శిక్ష ఖరారు చేయండి’’ అని అంతకు ముందు న్యాయమూర్తికి ఆయన నివేదించారు. తీర్పు సందర్భంగా సీబీఐ డీఐజీ చంద్రశేఖర్, డీఎస్పీ శంకర్రావు కోర్టుకు హాజరయ్యారు. రిమాండ్‌తో సరిపెట్టండి: నిందితుల లాయర్లు ‘రామలింగరాజు 33 నెలలు, రామరాజు 30 నెలలు, మిగతా నిందితులు కొన్ని నెలల పాటు జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసు ద్వారా వ్యక్తిగతంగా నిందితులకు తప్ప ఎవరికీ నష్టం జరగలేదు. ప్రస్తుతం సత్యం కంపెనీ షేరు విలువ కూడా గణనీయంగా పెరిగింది. కేసు విచారణ కాలంలో తీవ్రమైన క్షోభను అనుభవించారు గనుక విచారణ ఖైదీగా ఉన్న కాలంతో సరిపెట్టి వారిని విడిచిపెట్టండి’’ అని నిందితుల లాయర్లు ఉమామహేశ్వర్రావు, రవీందర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ప్రత్యేక హోదాకు జడ్జి నో తనకు జైలులో ప్రత్యేక ఖైదీ హోదా కల్పించాలన్న రామలింగరాజు అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఇంత తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి ప్రత్యేక హోదా కింద సౌకర్యాలు కల్పించాలని ఆదేశించలేనని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. ఆ డాక్యుమెంట్లు తిరిగిచ్చేయండి కేసు దర్యాప్తులో భాగంగా బైర్రాజు ఫౌండేషన్, సత్యం కంప్యూటర్స్సంస్థల నుంచి సీబీఐ అనేక డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని సీజ్ చేసింది. కేసుతో సంబంధం లేనివాటిని అప్పీల్ గడువు ముగిసిన తర్వాత సంబంధిత అధికారులకు తిరిగి అప్పగించాలని న్యాయమూర్తి సీబీఐని ఆదేశించారు. అతి పెద్ద ఆర్థిక నేరమిది సీబీఐ స్పెషల్ పీపీ ‘‘దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరమిది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు తప్పుడు ఖాతాలు సృష్టించారు. ఖాతాలు తారుమారు చేసి మదుపుదారులను మోసం చేశారు. దోషులందరికీ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది’’అని స్పెషల్ పీపీ సురేంద్ర తెలిపారు. ‘నేర తీవ్రతతో పాటు కార్పొరేట్ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసిన తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించి దోషులకు శిక్ష ఖరారు చేయండి’’ అని అంతకు ముందు న్యాయమూర్తికి ఆయన నివేదించారు. తీర్పు సందర్భంగా సీబీఐ డీఐజీ చంద్రశేఖర్, డీఎస్పీ శంకర్రావు కోర్టుకు హాజరయ్యారు. వడ్లమాని శ్రీనివాస్ (మాజీ సీఎఫ్‌వో) ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.33.75 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 25 నెలల జైలు శిక్ష. సుబ్రమణ్యం గోపాలకృష్ణన్ (ఆడిటర్) ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.33.75 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 24 నెలల జైలు శిక్ష. తాళ్లూరి శ్రీనివాస్ ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.30.25 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 24 నెలల జైలు శిక్ష. బి.సూర్యనారాయణ రాజు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.26 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 9 నెలల జైలు శిక్ష. జి.రామకృష్ణ ఏడేళ్ల జైలు శిక్షతోపాటు 34.50 లక్షల జరిమానా. . జరిమానా చెల్లించకపోతే మరో 28 నెలల జైలు శిక్ష. జి.వెంకటపతిరాజు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.27.75 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 16 నెలల జైలు శిక్ష. సీహెచ్ శ్రీశైలం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.27.75 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 16 నెలల జైలు శిక్ష. వీఎస్ ప్రభాకర్ గుప్తా ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.26 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 9 నెలల జైలు శిక్ష. తీర్పు మొత్తం పేజీలు -971 జరిమానా.. (కోట్లలో) రామలింగరాజు -5.74 రామరాజు - 5.74 మిగతా అందరికీ కలిపి -13.84 -
అభియోగాల నమోదును కొనసాగించండి
టెక్ మహీంద్ర కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో టెక్ మహీంద్రపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మోపిన అభియోగాలను నమోదు చేసేందుకు కింది కోర్టుకు బుధవారం హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ చట్టం కింద ఈడీ కింది కోర్టులో తమపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టెక్ మహీంద్ర హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి, ఈడీ కేసును కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ ఈడీ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా బుధవారం చీఫ్‌జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అభియోగాల నమోదులో పాల్గొనాలని టెక్ మహీంద్రకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
2016-17 నాటికి 5 బిలియన్ డాలర్లు..
టెక్ మహీంద్రా ఆదాయ లక్ష్యం ఇది ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ హైదరాబాద్: సాఫ్ట్వేర్ సేవల సంస్థ టెక్ మహీంద్రా 2016-17 నాటికి 5 బిలియన్ డాలర్ల ఆదాయం లక్ష్యంగా చేసుకుంది. రానున్న రోజుల్లో తమ కంపెనీతోపాటు పరిశ్రమకూ సాఫ్ట్వేర్ రంగంలో సానుకూల ఫలితాలు ఉంటాయని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. ఇది మంచి సంకేతమని, సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ సమీపంలోని బహదూర్‌పల్లి వద్ద ఏర్పాటైన మహీంద్రా గ్రూప్‌కు చెందిన ప్రీమియర్ ఇంజనీరింగ్ కళాశాల మహీంద్రా ఇకోల్ సెంట్రల్ క్యాంపస్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 3 బిలియన్ డాలర్ల ఆదాయంపై సుమారు 50 కోట్ల డాలర్ల నికర లాభం నమోదు చేసింది. భారీ కాంట్రాక్టుల మూలంగానే ఇంత మొత్తంలో ఆదాయం ఆర్జించగలిగామని ఆయన చెప్పారు. 4-5 బిలియన్లకు చేరుకోవడం అంత సులువేం కాదన్నారు. సత్యం కంప్యూటర్ స్కాంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నాం. సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. మాలాగే ప్రభుత్వం కూడా యోచిస్తే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. మాపై న్యాయపరమైన కేసు ఉండదని భావిస్తున్నాం. ఒకవేళ ఉంటే సవాల్ చేస్తాం’ అని స్పష్టం చేశారు.