దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం..హైదరాబాద్‌లోనే

Sas Infra South India Tallest Building In Hyderabad Kokapet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయం హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఏఎస్‌ ఇన్‌ఫ్రా జీ+57 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా ‘క్రౌన్‌’ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇప్పటివరకు దక్షిణ భారతంలో 50 అంతస్తులతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడా స్థానాన్ని భాగ్యనగర ‘క్రౌన్‌’ సొంతం చేసుకుంది. 
 
ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్‌మెంట్‌.. 
హైదరాబాద్‌కు చెందిన సాస్‌ ఇన్‌ఫ్రా కోకాపేటలో 4.5 ఎకరాల స్థలంలో క్రౌన్‌ పేరిట జీ+57 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. భవనం ఎత్తు 228 మీటర్లు. ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్‌మెంట్‌ ఉంటుంది. 6,565 చదరపు అడుగులు, 6,999 చ.అ., 8,811 చ.అ.లలో అపార్ట్‌మెంట్‌ విస్తీర్ణాలుంటాయి. ధర చదరపు అడుగుకు రూ.8,950గా నిర్ణయించామని సాస్‌ ఇన్‌ఫ్రా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే 60–70 యూనిట్లు విక్రయమయ్యాయని.. 2025 తొలి త్రైమాసికం నాటికి ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ టోల్‌ప్లాజా సమీపంలో జీ+42 అంతస్తులలో మరొక ప్రాజెక్ట్‌ కూడా రానున్నట్లు చెప్పారు.  

నానక్‌రాంగూడలో మూడు బేస్‌మెంట్లు 32 అంతస్తులలో ఆక్రోపోలిస్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన సుమధుర నిర్మాణ సంస్థ.. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో నాలుగు బేస్‌మెంట్లు, స్టిల్ట్‌+44 అంతస్తుల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. 5.06 ఎకరాల విస్తీర్ణం 20 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియాలో ఒలంపస్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. ఇందులో 854 యూనిట్లుంటాయి. 1,670–3,000 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర రూ.7,499లుగా నిర్ణయించామని సుమధుర వైస్‌ చైర్మన్‌ కేవీ రామారావు తెలిపారు. 

చదవండి : Lijjat Papad: రూ.80 పెట్టుబడి కట్‌ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్‌

ఎక్కడ వస్తున్నాయంటే? 
నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లలో ఎక్కువగా హైరైజ్‌ నిర్మాణాలు వస్తున్నాయి.  
ల్యాండ్‌ రేట్లు విపరీతంగా పెరిగిపోవటమే డెవలపర్లు హైరైజ్‌ బిల్డింగ్స్‌ నిర్మించడానికి ప్రధాన కారణమని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే ఈ తరహా నిర్మాణాలే సరైనవి. ప్రాజెక్ట్‌ మొత్తం స్థలంలో నిర్మాణాలు కేవలం 20 శాతం లోపు ఉండటం మంచి పరిణామం. ఫలితంగా మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించవచ్చు. 

హైరైజ్‌ ఉన్న చోట అభివృద్ధి.. 
హైరైజ్‌ బిల్డింగ్స్‌ ఉండే ఏరియాలు త్వరగా డెవలప్‌ అవుతాయి. ల్యాండ్‌మార్క్‌ టవర్లే ఏరియా పేరుగా మారిపోతాయి. ఎక్కువ జనాభా నివాసముంటుంది కాబట్టి రిటైల్, షాపింగ్‌ కాంప్లెక్స్‌లతో వాణిజ్య భవనాలు వస్తాయి. బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, కార్పొరేట్‌ ఓనర్లు, ఐటీలోని వర్కింగ్‌ కపుల్స్‌ ఎక్కువగా హైరైజ్‌ బిల్డింగ్స్‌ కొనుగోలు చేస్తుంటారని సుమధుర సీఎండీ మధుసూదన్‌ తెలిపారు.  నిర్మాణం ఎత్తు పెరిగే కొద్దీ వ్యయం కూడా పెరుగుతుంటుంది. సాధారణంగా చ.అ.కు నిర్మాణ వ్యయం రూ.2 వేలు అయితే.. హైరైజ్‌లో రూ.3 వేల వరకు అవుతుంది.  

ప్రభుత్వం ఏం చేయాలంటే? 
సాధారణ భవన నిర్మాణలతో పోలిస్తే హైరైజ్‌ భవనాల అనుమతుల జారీలో ప్రత్యేక శ్రద్ధ, నిరంతర తనిఖీ, పర్యవేక్షణ అవసరం. పర్మిషన్‌ ఫీజులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భవిష్యత్తులో జరిగే ప్రమాద నష్టాలను ఊహించలేం. 
హైరైజ్‌ బిల్డింగ్స్‌లో ఉండే ఎక్కువ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులను విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
ప్రతి అంతస్తుని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి ఇతరత్రా అంశాలను తనిఖీ చేయాలి. 
ఆయా భవనాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణంలో నాణ్యతను పరిశీలించాలి. ట్రాఫిక్‌ అసెస్‌మెంట్‌ను పూర్తి స్థాయి స్టడీ చేసిన తర్వాతే అనుమతులను జారీ చేయాలి. 

లాభాలు ఏంటంటే? 
ఎత్తైన నిర్మాణాల్లో నివాసముంటే మన ఆలోచన శక్తి, విధానపరమైన నిర్ణయాలు కూడా ఎత్తులో ఉంటాయి. పొద్దున్న లేవగానే బాల్కనీ నుంచి సిటీ వ్యూ చూస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. 
ఇంట్లోకి గాలి, వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వస్తాయి. చుట్టూ పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. 
ధ్వని, వాయు కాలుష్య సమస్య ఉండదు. పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. 
ప్రాజెక్ట్‌లోని నివాసితులందరూ ఒకే స్థాయి వాళ్లు ఉంటారు కాబట్టి పెద్దగా సోషల్‌ గ్యాప్‌ ఉండదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top