
భూటాన్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు రిలయన్స్ పవర్ ఆ దేశానికి చెందిన గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 500 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.2,000 కోట్ల పెట్టుబడితో భూటాన్ పెట్టుబడి సంస్థ డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్(డీహెచ్ఐ)తో కలిసి జాయింట్ వెంచర్((50-50)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
క్లీన్ ఎనర్జీ విస్తరణ
భూటాన్ చాలాకాలంగా జలవిద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా నిలుస్తుంది. ఈ రంగం దాని ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదం చేస్తుంది. అయినప్పటికీ సౌర విద్యుత్‌ను విస్తరిస్తూ పునరుత్పాదక ఇంధన రంగాన్ని వైవిధ్యపరచడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. సౌరశక్తిని పెంచుకోవడం ద్వారా భూటాన్ మరింత స్థిరమైన ఇంధన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఇదీ చదవండి: భూమార్గాల ద్వారా దిగుమతులపై భారత్ నిషేధం
రిలయన్స్ పవర్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులను సమీకరిస్తోంది. ఈ జాయింట్ వెంచర్ ప్రాంతీయ ఇంధన భద్రతను పెంచుతుందని, సంప్రదాయ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, దక్షిణాసియాలో భూటాన్‌ను క్లీన్ ఎనర్జీ హబ్‌గా నిలుపుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.