
కచ్‌లో సోడాయాష్ కొత్త ప్లాంట్
మంజూరైన పర్యావరణ అనుమతులు
2030 నాటికి రెట్టింపు కానున్న సామర్థ్యం
న్యూఢిల్లీ: దేశీయంగా సోడాయాష్ తయారీలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న జీహెచ్‌సీఎల్ రూ.6,500 కోట్లతో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో సోడాయాష్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఆరు నెలల్లో ప్లాంట్ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ ఎండీ ఆర్‌ఎస్ జలాన్ ప్రకటించారు. ఇది పూర్తయితే సోడాయాష్ తయారీ సామర్థ్యం రెట్టింపై 2.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తికి చేరుకుంటుందని తెలిపారు. 2030 నాటికి 300 గిగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి, ఈ ప్లాంట్ ఏర్పాటు కీలక మద్దతుగా నిలవనుంది.
సోలార్ గ్లాస్ తయారీలో సోడాయాష్ ను కీలక ముడి పదార్థంగా వినియోగిస్తుంటారు. ఈ రంగానికి జీహెచ్‌సీఎల్ ముఖ్య సరఫరాదారుగా ఉండడం గమనార్హం. కొత్త ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిలో అధిక భాగాన్ని కొనుగోలు చేసినట్టు, పర్యావరణ అనుమతులు సహా అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేసినట్టు జలాన్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సోడాయాష్ తయారీ సామర్థ్యం 1.2 మిలియన్ టన్నులుగా ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో రెండు దశల్లో కలిపి 1.1 మిలియన్ టన్నుల కొత్త సామర్థ్యం తోడుకానుంది.
సోలార్ గ్లాస్ పరిశ్రమ అవసరాలకు..
ముఖ్యంగా సోలార్ గ్లాస్ తయారీ కోసమే రూపొందించిన లార్జ్‌డెన్స్ సోడాయాష్ ను కొత్త ప్లాంట్‌లో తయారు చేయనున్నట్టు జలాన్ తెలిపారు. ‘‘119 గిగావాట్ల నుంచి 300 గిగావాట్లకు సోలార్ విద్యుదుత్పాదన పెంచుకోవడం అన్నది మాకు పెద్ద మార్కెట్‌ను కల్పించనుంది. గణనీయమైన సామర్థ్యంతో డెన్స్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. కనుక మాకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నాయి’’అని వివరించారు. పర్యావరణ అనుకూలమైన, అధిక ఇంధన సామర్థ్యంతో, అత్యాధునిక సాంకేతికతకు ఈ ప్లాంట్ నిర్మాణంలో వినియోగిస్తున్నట్టు తెలిపారు.
కంపెనీ వద్ద రూ.1,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని.. రుణం, ఈక్విటీ జారీ రూపంలో మిగిలిన నిధులను సుమకూర్చుకోనున్నట్టు చెప్పారు. మొత్తం మీద రుణ భారం ఈక్విటీలో 0.6–0.7 రెట్లు మించదన్నారు. ప్రస్తుతం కంపెనీకి ఎలాంటి రుణ భారం లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశ అవసరాల్లో 20 శాతం మేర సోడాయాష్ ను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా సోడాయాష్ తయారీలో చైనా వాటా 45 శాతంగా ఉంది. భారత్‌లోకి చౌకగా సోడాయాష్ ను పంపిస్తుండడంతో ఇక్కడి పరిశ్రమల మార్జిన్లపై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌సీఎల్ కొత్త ప్లాంట్‌తో ముందుకు వెళుతోంది.