
బంగ్లాదేశ్ నుంచి భూమార్గాల ద్వారా రెడీమేడ్ వస్త్రాల దిగుమతిపై భారత్ ఇటీవల నిషేధం విధించింది. ‘నవా షెవా’, ‘కోల్‌కతా సీపోర్ట్స్’ ద్వారా మాత్రమే దిగుమతులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ చర్య భారతదేశ టెక్స్‌టైల్ తయారీ రంగానికి ఊతమిస్తుందని, దేశీయ ఉత్పత్తిదారులకు రూ.1,000 కోట్లకు పైగా వ్యాపారాన్ని సృష్టించగలదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. స్థానిక తయారీని బలోపేతం చేయడం, విదేశీ కంపెనీలు అనుసరిస్తున్న వాణిజ్య లొసుగులను తగ్గించడం ఈ పాలసీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
మార్కెట్ ధరలపై ప్రభావం
స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్వల్పకాలిక సరఫరా గొలుసు అంతరాయాలకు దారితీయవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. లాజిస్టిక్స్‌లో సర్దుబాట్ల కారణంగా కొన్ని బ్రాండెడ్ వస్త్రాల ధరలు స్వల్పంగా పెరగవచ్చని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాలోని కొన్ని కంపెనీలు తమ వస్త్రాలను బంగ్లాదేశ్‌లోకి ఎగమతి చేసి, అక్కడి నుంచి సుంకం లేకుండా భారతదేశానికి ఎగుమతులు చేస్తున్నాయి. ఈ చర్యలను కట్టడి చేసేందుకు కూడా భారత్ తాజా నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
వాణిజ్య సంబంధాలు
భారత్ నుంచి పత్తి, నూలు దిగుమతులపై బంగ్లాదేశ్ ఇటీవల ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిషేధం నిర్ణయం తీసుకున్నారు. రెండు దేశాల్లో మారుతున్న వాణిజ్య సంబంధాలను ఈ పరిణామాలు హైలైట్ చేస్తున్నాయి. తాజా విధానం భారతీయ వ్యాపారాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.