
రూ.3.09 లక్షల కోట్లు
6.7 శాతం వృద్ధి
10 శాతం తగ్గిన దిగుమతులు
ఎగుమతులు ఆగస్ట్‌లో మెరుగైన వృద్ధిని చూశాయి. 35.1 బిలియన్ డాలర్ల విలువైన (సుమారు రూ.3.09 లక్షల కోట్లు) వస్తు ఎగుమతులు నమోదయ్యాయి. అదే సమయంలో దిగుమతులు 10.12 శాతం తగ్గి 61.59 బిలియన్ డాలర్లు (రూ.5.42 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో ఆగస్ట్ నెలలో వాణిజ్య లోటు 26.49 మిలియన్ డాలర్లకు (రూ.2.33 లక్షల కోట్లు) పరిమితమైంది. క్రితం ఏడాది ఆగస్ట్‌లో వాణిజ్య లోటు 35.64 బిలియన్ డాలర్లతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో బంగారం దిగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 56 శాతం తగ్గడం అనుకూలించింది.
కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్ట్‌లో వస్తు, సేవల ఎగుమతులు అన్నీ కలిపి 69.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో ఇవి 63.25 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఆగస్ట్‌లో వస్తు, సేవల దిగుమతులు 79.04 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 9.88 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
భారత ఉత్పత్తులపై అమెరికా రెండు విడతల్లో విధించిన మొత్తం 50 శాతం టారిఫ్‌లు ఆగస్ట్ నుంచి అమల్లోకి రాగా, ఇదే నెలలో ఆ దేశానికి 6.86 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. భారత ఎగుమతుల్లో అమెరికాయే మొదటి స్థానంలో నిలిచింది.
యూఏఈకి 3.24 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్‌కు 1.83 బిలియన్ డాలర్లు, చైనాకి 1.21 బిలియన్ డాలర్లు, యూకేకి 1.14 బిలియన్ డాలర్ల చొప్పున ఎగుమతులు వెళ్లాయి.
ఇక చైనా నుంచి అత్యధికంగా 10.91 బిలియన్ డాలర్ల వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత రష్యా నుంచి 4.83 బిలియన్ డాలర్లు, యూఏఈ నుంచి 4.66 బిలియన్ డాలర్లు, యూఎస్ నుంచి 3.6 బిలియన్ డాలర్లు, సౌదీ నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు నమోదయ్యాయి.
బంగారం దిగుమతులు 56.67 శాతం తగ్గి 5.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
సేవల ఎగుమతుల వరకే చూస్తే 34.06 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2024 ఆగస్ట్‌లో సేవల ఎగుమతులు 30.36 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి.
ఎల్రక్టానిక్స్ వస్తు ఎగుమతులు 2.93 బిలియన్ డాలర్లు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు 9.9 బిలియన్ డాలర్లు, రత్నాభరణాలు 2.31 బిలియన్ డాలర్లు, పెట్రోలియం ఉత్పత్తులు 4.48 బిలియన్ డాలర్లు, ఫార్మా ఎగుమతులు 2.51 బిలియన్ డాలర్ల చొప్పున ఆగస్ట్‌లో నమోదయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఐదు నెలల్లో వస్తు సేవల ఎగుమతులు 349.35 బిలియ్ డాలర్లుగా ఉన్నట్టు వాణిజ్య శాఖ అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 329 బిలియన్ డాలర్ల కంటే 6.18 శాతం అధికం.
ఆగస్ట్ చివరి నాటికి వాణిజ్య మిగులు 80.97 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా?