
బయటి దేశాల నుంచి వచ్చే వెండి దిగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రత్నాలు లేని సాధారణ వెండి ఆభరణాల (Silver jewellery) దిగుమతులను పరిమితం చేసింది. ఈ ఆంక్షలు తక్షణం అమల్లోకి వచ్చి 2026 మార్చి చివరి వరకు కొనసాగుతాయి.
వెండి దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. "స్వేచ్ఛా విధానం నుంచి పరిమిత విధానానికి దిగుమతి విధానాన్ని తక్షణమే మార్పు చేశాం. ఈ మార్పు మార్చి 31, 2026 వరకు అమలులో ఉంటుంది" అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీని ప్రకారం.. దీనిపై ఇకపై వెండి ఆభరణాలు దిగుమతి (Imports) చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆంక్షలకు కారణాలు ఇవే..
2024-25 ఏప్రిల్-జూన్ నుండి 2025-26 ఏప్రిల్-జూన్ వరకు ప్రిఫరెన్షియల్ డ్యూటీ మినహాయింపుల కింద వెండి ఆభరణాల దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఇలా దిగుమతి చేసుకున్న వెండి వస్తువులను పూర్తయిన ఆభరణాలుగా చూపించి దిగుమతి సుంకాలను ఎగ్గొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం భారతదేశ ఆభరణాల తయారీదారులకు సమాన అవకాశాలను అందిస్తుందని, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ప్రయోజనాలను పరిరక్షించగలదని, ఈ రంగంలోని కార్మికులకు జీవనోపాధి అవకాశాలను కల్పిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు: మరింత గుడ్‌న్యూస్!