
ఆర్‌బీఐ నుంచి రికార్డు డివిడెండ్
రూ.2.69 లక్షలకోట్లు
ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ రికార్డు స్థాయిలో రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2023–24) చెల్లించిన రూ. 2.1 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 27.4 శాతం అధికం. 2022–23లో ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించింది.
‘రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో జరిగిన 616వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో రూ. 2,68,590.07 కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు‘ అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల వేళ రక్షణ శాఖకు కేటాయింపులు భారీగా పెంచాల్సి రావడం, అమెరికా టారిఫ్‌లపరంగా నెలకొన్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వానికి ఇది సహాయకరంగా ఉండనుంది.
ఆర్‌బీఐ ఏటా తన పెట్టుబడులపై వచ్చే అదనపు రాబడిని, డాలర్ మారకంలో మార్పుల వల్ల వచ్చే ప్రయోజనాలు మొదలైన వాటిని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో బదలాయిస్తుంది. ఈసారి ఇది రూ. 2.5 – రూ. 3 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. తాజా బడ్జెట్‌లో అంచనా వేసిన దానికంటే ఆర్‌బీఐ ప్రకటించిన డివిడెండు సుమారు రూ. 0.4–0.5 లక్షల కోట్లు అధికమని, పన్ను వసూళ్లు లేక డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించలేకపోయినా, లేదా లెక్కకు మించి వ్యయాలు ఎదురైనా అధిగమించేందుకు ఇది సహాయపడగలదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు.
రిస్క్ బఫర్ 7.50 శాతానికి పెంపు..
అంతర్జాతీయ, దేశీ పరిస్థితులు, రిసు్కలు మొదలైన అంశాలను సమావేశంలో సమీక్షించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ పనితీరును కూడా సమీక్షించి వార్షిక నివేదికకు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన కంటింజెంట్ రిస్క్ బఫర్‌ని (సీఆర్‌బీ) ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీటులో 7.50 శాతానికి పెంచాలని సెంట్రల్ బోర్డ్ నిర్ణయించింది. 2023–24లో దీన్ని 6.5 శాతానికి పెంచారు.