
ప్రస్తుతానికి వేచిచూద్దాం!
కీలక పాలసీ రేట్లు యథాతథం
తటస్థ వైఖరికే కట్టుబడిన ఆర్‌బీఐ ఎంపీసీ
ద్రవ్యోల్బణం అంచనా 3.1 శాతానికి తగ్గింపు
జీడీపీ వృద్ధి అంచనా 6.5 శాతం స్థాయిలోనే
ముంబై: వరుసగా మూడు సమీక్షల్లో కీలక రేట్లను తగ్గిస్తూ వచ్చిన ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ సారి ఆచితూచి వ్యవహరించింది. కీలకమైన రెపో రేటును (ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటు) 5.5 శాతం వద్దే కొనసాగించాలని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
రివర్స్ రెపో రేటును (బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ తీసుకునే నిధులపై రేటు) సైతం 3.35 శాతం వద్దే కొనసాగించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అస్పష్ట వాణిజ్య విధానాలకు తోడు టారిఫ్‌ల పట్ల అనిశ్చితులు కొనసాగుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుంది.
ఇప్పటికే పలు విడతలుగా రేట్లను తగ్గించగా ఇది పూర్తి స్థాయిలో బదిలీ కావాల్సి ఉండడం, ద్రవ్యోల్బణం రిస్క్‌ను దృష్టిలో పెట్టుకుని రేట్ల పరంగా యథాతథ స్థితిని కొనసాగించడమే ఉత్తమమని భావించింది. ద్రవ్య పరపతి విధానం పరంగా తటస్థ వైఖరినే (న్యూట్రల్) కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) ద్రవ్యోల్బణం మొత్తం మీద 3.7 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను 3.1 శాతానికి తగ్గించింది. అలాగే, జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం అంచనాలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాం..
రుతుపవన ఆధారిత వర్షాలు అనుకున్న విధంగా కొనసాగుతుండడం, పండుగల సీజన్ సమీపిస్తుండడం ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిస్తాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచ క్రమంలో బలమైన మూలాలు, సౌకర్యవంతమైన ఫారెక్స్ మిగులు నిల్వలు కలిగి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు మధ్యకాలానికి ఉజ్వల అవకాశాలున్నట్టు చెప్పారు. అన్ని రకాల డేటాను గమనిస్తూ అవసరమైతే రేట్లపై తగిన నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ‘‘అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లతో కూడిన వాతావరణంలో భారత ఆర్థిక వ్యవస్థ ధరల స్థిరత్వంతో, నిలకడైన వృద్ధి పథాన్ని కొనసాగించింది.
ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడంతో వృద్ధికి మద్దతుగా పరపతి విధానాన్ని చక్కగా వినియోగించుకున్నాం. ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య నాలుగు నెలల్లోనే రెపో రేటును ఒక శాతం తగ్గించాం. వ్యవస్థలో రేట్ల బదలాయింపు ఇంకా కొనసాగుతోంది’’అని చెప్పారు. రేట్ల తగ్గింపు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అప్పుడు రుణ వితరణ పుంజుకోవచ్చన్నారు. గృహ రుణ విభాగం 14 శాతం వృద్ధితో మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతమున్న తీవ్ర అనిశ్చితుల్లో రూపాయి ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు.
ఏడాది చివర్లో ద్రవ్యోల్బణం పైపైకి..
ఏడాది చివర్లో ద్రవ్యోల్బణం కొంత పెరిగే అవకాశాలున్నట్టు మల్హోత్రా చెప్పారు. ‘‘రిటైల్ ద్రవ్యోల్బణం క్యూ4లో (2026 జనవరి–మార్చి) 4 శాతం పైకి చేరుకోవచ్చు. విధానపరమైన చర్యల మద్దతుతో (రేట్ల కోత) డిమాండ్ పెరగడం ఇందుకు దారితీయొచ్చు’’అని అభిప్రాయపడ్డారు.
అకౌంట్, లాకర్ క్లెయిమ్ సులభతరం
బ్యాంక్ ఖాతాలు, లాకర్ల క్లెయిమ్ ప్రక్రియను ప్రామాణీకరించనున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు. మరణించిన కస్టమర్ల తరఫున నామినీ సులభంగా క్లెయిమ్ చేసుకోవడం దీని లక్ష్యమని చెప్పారు. ట్రెజరీ బిల్లుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుగా ఆర్‌బీఐ రిటైల్–డైరెక్ట్ ప్లాట్‌ఫామ్ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు.
పాలసీ ముఖ్యాంశాలు..
→ యథాతథ స్థితికి అనుకూలంగా ఎంపీసీలోని ఆరుగురు సభ్యులు ఓటు వేశారు.
→ రెపో రేటును ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు ( పావుశాతం) తగ్గించి 6.25 శాతం చేయగా, ఏప్రిల్‌లో మరో పావు శాతం కోతతో 6 శాతానికి దిగొచ్చింది. జూన్‌లో అర శాతం కోతతో 5.5 శాతానికి పరిమితమైంది.
→ రివర్స్ రెపో రేటు 3.35 శాతంలోనూ ఎలాంటి మార్పులేదు.
→ తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్ష సెప్టెంబర్ 29– అక్టోబర్ 1 మధ్య నిర్వహించనున్నారు.
డెడ్ ఎకానమీ కాదు.. సంజీవని
భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ (నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థ) అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా తగిన బదులిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తోందంటూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా కంటే భారతే దన్నుగా నిలుస్తున్నట్టు చెప్పారు. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతంగా ఉంటే, భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతంగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావించారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో అమెరికా వాటా 11 శాతంగా ఉంటే, భారత్ 18 శాతం సమకూరుస్తోంది. ఇదే పనితీరును ఇక ముందూ కొనసాగిస్తాం’’అని చెప్పారు. భారత వృద్ధి ఆకాంక్షలు 6.5 శాతం కంటే అధికంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఏటా సగటున 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడాన్ని గుర్తు చేశారు.