
మార్చి చివరికి 10.7% పెరుగుదల
ముంబై: ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఆర్‌బీఐ – డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ (ఆర్‌బీఐ–డీపీఐ) ఈ ఏడాది మార్చి నెలకు 493.22గా నమోదైంది. దీనికి ఆరు నెలల ముందు.. 2024 సెప్టెంబర్‌లో ఈ సూచీ 455.5గా ఉండడం గమనార్హం. అంటే డిజిటల్ చెల్లింపుల్లో 10.7% మేర వృద్ధి నమోదైంది. చెల్లింపుల సదుపాయాలు, సరఫరా వైపు అంశాలు ఆర్‌బీఐ–డీపీఐ సూచీ బలపడేందుకు దారితీసినట్టు ఆర్‌బీఐ తెలిపంది.
ఐదు అంశాల ఆధారంగా చెల్లింపుల తీరును ఆర్‌బీఐ మదింపు వేస్తుంటుంది. ఇందులో చెల్లింపులు చేసే వారు (25% వెయిటేజీ), చెల్లింపులు సదుపాయాలు – డిమాండ్ వైపు అంశాలు (10%) పేమెంట్ (Payment) సదుపాయాలు – సరఫరా వైపు అంశాలు (15%), చెల్లింపుల పనితీరు (45%), వినియోగదారుల కేంద్రీకరణ 5% చొప్పున వెయిటేజీ కలిగి ఉన్నాయి.
విప్రో ఇన్‌ఫ్రా నుంచి కొత్త బిజినెస్
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ సొల్యూషన్లు అందించే విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ (విన్) తాజాగా కొత్త బిజినెస్ విభాగానికి తెరతీసింది. విప్రో ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ పేరుతో ఏర్పాటు చేసిన విభాగంపై రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల(పీసీబీలు) తయారీలో ఉపయోగించే బేస్ మెటీరియల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం కర్ణాటకలో కాపర్ క్లాడ్ లామినేట్(సీసీఎల్) తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు వివరించింది. దీంతో సుమారు 350 మందికి ఉపాధి లభించనుంది.
చదవండి: టీసీఎస్ లేఆఫ్స్‌తో ఆర్థిక ప్రకంపనలు
పెగాసిస్టమ్స్ డెవలపర్ల కోసం ఎక్స్‌పర్ట్ సర్కిల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తమ డెవలపర్ల కోసం ఎక్స్‌పర్ట్ సర్కిల్స్ సెషన్లను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ డెవలపర్లలో 50 శాతం మంది భారత్‌లో ఉన్నారని, వారు తమ నైపుణ్యాలను మరింతగా పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పెగాఇన్నోవేట్ 2025 కార్యక్రమం సందర్భంగా కంపెనీ ఎండీ దీపక్ విశ్వేశ్వరయ్య తెలిపారు. పెగా ప్రధాన టెక్నాలజీలైన బ్లూప్రింట్, యాప్ డిజైన్‌లాంటి టెక్నాలజీలు తదితర అంశాల గురించి ఈ సెషన్స్‌లో చర్చిస్తారు. ఒక్కో సెషన్‌లో 50 మంది వరకు పాల్గొనవచ్చని దీపక్ చెప్పారు.