
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తన మొత్తం సిబ్బందిలో 2 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. టీసీఎస్ ప్రకటన ఆర్థిక ప్రకంపనలకు(ఎకనామిక్ ఎర్త్‌క్వేక్) కారణమవుతుందన్నారు. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇందులో ప్రభావితం చెందే వారిలో ఎక్కువ మంది మిడిల్, సీనియర్ గ్రేడ్ ఉద్యోగులు ఉండబోతున్నట్లు సంస్థ తెలిపింది.
2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ‘నైపుణ్యాల అసమతుల్యత వల్ల కంపెనీ ఈమేరకు ప్రకటన చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ వార్త ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇది ఆర్థిక ప్రకంకపనలు సృష్టిస్తుంది’ అని జైరాం రమేష్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. టెక్నాలజీ, కృత్రిమ మేధ, మార్కెట్ విస్తరణ, శ్రామిక శక్తి పునర్వ్యవస్థీకరణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉంటున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ విస్తృత వ్యూహంలో భాగంగా లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ టారిప్‌లపై కీలక ప్రకటన
బాధిత ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఉపాధి కల్పనను పెంచడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలగింపులపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడాన్ని పరిశీలిస్తుంది.