
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ టారిఫ్‌లను పెంచే యోచన లేదని కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతదేశం అంతటా 4జీ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. బీఎస్ఎన్ఎల్ త్వరలో టారిఫ్‌లను పెంచబోతుందనే వాదనలను తోసిపుచ్చుతూ మంత్రి ఈమేరకు స్పష్టత ఇచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు) పాల్గొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఎప్పటినుంచో 2జీ, 3జీ నెట్‌వర్క్‌ల్లో వాడుతున్న పాత చైనీస్ పరికరాలను స్వదేశీ 4జీ మౌలిక సదుపాయాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చెప్పారు. అయితే, ఎప్పటిలోపు దీన్ని పూర్తి చేస్తారో నిర్దిష్ట కాలపరిమితి తెలపలేదు. బీఎస్‌ఎన్‌ఎల్ 2జీ, 3జీ సేవలను దశలవారీగా నిలిపివేస్తున్నప్పటికీ, 5జీకి మారే ప్రణాళికలు మాత్రం ప్రస్తుతానికి లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి.
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ప్రస్తుతం 4జీ సరిపోతుందని మంత్రి అన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా 4జీ నెట్‌వర్క్‌ను అందించడమే ప్రస్తుత ప్రాధాన్యమని పెమ్మసాని తెలిపారు. ఇతర టెల్కోల్లో 75 శాతం మంది వినియోగదారుల అవసరాలను 4జీ తీరుస్తుందన్నారు. స్వదేశీ 5జీ కోర్, అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయని, ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నప్పుడే ఈ విషయంలో ముందుకెళ్తామన్నారు.
మొబైల్ కస్టమర్ గ్రోత్, ఏఆర్పీయూ, ఫిక్స్డ్ వైర్‌లెస్ వంటి విభాగాల్లో ప్రతి సర్కిల్‌కు లక్ష్యాలు కేటాయించినట్లు చెప్పారు. ఏటా 20-30 శాతం ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 1,00,000 స్వదేశీ 4జీ టవర్లను ఏర్పాటు చేసిందని, వీటి ఇంటిగ్రేషన్ ప్రక్రియ సవాలుతో కూడుకున్నదని మంత్రి అన్నారు. నోకియా, ఎరిక్సన్ వంటి గ్లోబల్ కంపెనీలకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దశాబ్దాలు పట్టిందని, కానీ బీఎస్‌ఎన్‌ఎల్ కేవలం 2–3 ఏళ్లలోనే 90–95% సమస్యలను పరిష్కరించిందని తెలిపారు.
ఇదీ చదవండి: క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లు
మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం, పౌర కేంద్రీకృత సేవల పంపిణీని మెరుగుపరచడం, భారత టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక పాత్రను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని కేంద్రమంత్రి సింథియా చెప్పారు. కంపెనీ పరివర్తనను ఆయన ప్రశంసించారు. కస్టమర్ అనుభవం, ఆదాయ సృష్టిలో గణనీయమైన మెరుగుదల అవసరాన్ని నొక్కి చెప్పారు.