
డబ్బు ఖర్చులు, పెట్టుబడులపై ఒక్కొక్కరి నిర్ణయాలు ఒక్కోలా ఉంటాయి. మనకు బాగా తెలిసినవారు డబ్బుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాదాపు వాటినే మనలో చాలా మంది అనుసరిస్తుంటారు. కానీ ఒక్కొక్కరి భవిష్యత్తు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలుండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
‘డబ్బు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. మీ అంకుల్ స్మాల్ క్యాప్ షేర్లపై పెట్టుబడి పెట్టొచ్చు. క్రిప్టోనే భవిష్యత్తు అని మీ స్నేహితుడు ఎంచుకోవచ్చు. మీ పక్కింటివారు ఫిక్స్డ్ డిపాజిట్లలో మాత్రమే తమ పెట్టుబడిని కొనసాగించవచ్చు. అయినంత మాత్రాన వారి నిర్ణయాలను కాపీ కొట్టాలా? కాదు కదా.. మీ పోర్ట్ ఫోలియో మీ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలను తీర్చేలా ఉండాలి. పొరుగువారిని అనుసరించి పెట్టుబడులు పెట్టకూడదు. మీ సొంత ప్రణాళికలు రూపొందించుకోండి. చాలా ఉచిత సలహాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి. మీ అవసరాలకు సరిపోని వాటిని ఎంచుకోకూడదు. మీ ఆత్మీయులు చెప్పింది వినండి. కానీ మీకు నిజంగా ఏది అవసరమో అదే చేయండి’ అని రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..
ప్రతి ఒక్కరికీ వారి సొంత పెట్టుబడి మార్గం ఉండాలి. కానీ చాలా మంది పక్కవారి అవసరాలను పరిగణించుకోకుండా గుడ్డిగా వారి నిర్ణయాలను అనుసరిస్తారు. మెరుగైన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించడం చాలాముఖ్యం. పిల్లల చదువు కోసం మీరు పొదుపు చేయవచ్చు.. హాలిడే కోసం ప్లాన్ చేయవచ్చు.. లేదా ఎమర్జెన్సీ నిధిని ఏర్పాటు చేయవచ్చు. అందుకు వేరొకరిని అనుసరించకూడదని నిపుణులు చెబుతున్నారు.