
హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రియా నాయర్ నియమితులయ్యారు. ఆగస్టు 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నట్లు హెచ్యూఎల్ ప్రకటించింది. ఐదేళ్ల కాలానికి ఆమె నియామకానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం యూనిలీవర్ లో బ్యూటీ అండ్ వెల్ బీయింగ్ విభాగానికి బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ సేవలందిస్తున్న నాయర్ ప్రపంచ మార్కెట్లలో 13 బిలియన్ యూరోల పోర్ట్ ఫోలియోను పర్యవేక్షిస్తున్నారు. జూలై 31న పదవి నుండి వైదొలగనున్న రోహిత్ జావా స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. 2023లో హెచ్యూఎల్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జావా.. యూనిలీవర్లో 37 ఏళ్ల విశిష్ట కెరీర్ను ముగించి బోర్డుతో పరస్పర ఒప్పందం తర్వాత వైదొలగుతున్నారు.
ఎన్నో బ్రాండ్లు..
దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రియా నాయర్ హెచ్యూఎల్ లో అనేక ప్రముఖ పదవులను నిర్వహించారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ హోమ్ కేర్ అలాగే బ్యూటీ & పర్సనల్ కేర్ కూడా ఉన్నాయి. అక్కడ ఆమె డవ్, రిన్, కంఫర్ట్ వంటి ఫ్లాగ్ షిప్ బ్రాండ్ల వృద్ధికి నాయకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ అండ్ బ్రాండ్ పరివర్తన వ్యూహాలను నడిపిస్తూ, బ్యూటీ & వెల్బీయింగ్ విభాగానికి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు.

ఇక నాయర్ విద్యార్హతల విషయానికి వస్తే.. సిడెన్హామ్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె పుణెలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశారు. హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.5.6 లక్షల కోట్లుగా ఉంది.
హెచ్యూఎల్ గ్లోబల్ సీఎంఓగా నాయర్ సాధించిన విజయాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. ఆమె సోషల్-ఫస్ట్ మార్కెటింగ్ విధానాలను రూపొందించిందని, ప్రభావశీల-ఆధారిత ఆవిష్కరణలను విస్తరించిందని చెప్పుకొచ్చింది. యువ, డిజిటల్ అవగాహన ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి యూనిలీవర్ బ్యూటీ బ్రాండ్లను పునర్నిర్మించే లక్ష్యంతో గ్లోబల్ ప్రచారాలను ప్రారంభించిందని పేర్కొంది.