క్రమశిక్షణ, పట్టుదల ఉంటే రూపాయి రూపాయి కూడబెట్టి కూడా కలలను నిజం చేసుకోవచ్చని నిరూపించారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన 51 ఏళ్ల చర్చ్ పాస్టర్ బి.రవి జోసెఫ్. గత మూడేళ్లుగా తాను దాచుకున్న రూ.10 నాణేలతో ఏకంగా రూ.1.23 లక్షల విలువైన హోండా యాక్టివా స్కూటర్ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.
చెల్లని నాణేల ప్రచారాన్ని దాటి..
రోజువారీ కిరాణా, ఇతర అవసరాల నిమిత్తం జరిపే లావాదేవీల్లో చిల్లరగా వచ్చిన ప్రతి 10 రూపాయల నాణెంను దాచడం అలవాటు చేసుకున్నారు జోసెఫ్. మార్కెట్లో రూ.10 నాణేలు చెల్లవనే అపోహలు, ప్రచారాలు ఊపందుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా నాణేలు దాచవద్దని వారించారు. అయినా ఆయన ప్రచారాలను పట్టించుకోకుండా తన పొదుపు ప్రయాణాన్ని కొనసాగించారు.
రెండు గంటల పాటు లెక్కించిన షోరూమ్ సిబ్బంది
తాను కూడబెట్టిన రూ.1.23 లక్షల విలువైన నాణేల సంచులను చూసి లక్షెట్టిపేటలోని హోండా మోటార్స్ షోరూమ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ నాణేలన్నింటినీ లెక్కించడానికి షోరూమ్ సిబ్బందికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. మొత్తం సొమ్ము సరిపోవడంతో కుటుంబసమేతంగా వచ్చి కొత్త వాహనాన్ని డెలివరీ తీసుకున్నారు.
ఇదీ చదవండి: రచ్చకెక్కిన టీవీఎస్ ఫ్యామిలీ వార్


