కథానీతి
ఒక ఆధ్యాత్మిక గురువు తన శిష్యులతో కలిసి బోధనలు చేయడానికి పల్లెకు బయలుదేరాడు. వారి దారిలో ఒక నది ఉంది. కొందరు పిల్లలు ఆ నదిలోకి దుముకుతూ కనిపించారు. నీళ్లలో కొద్దిసేపు మునిగి లేచాక కొందరి ముఖాల్లో మెరుపు ఉంది. మరికొందరి ముఖాల్లో విచారం ఉంది. కానీ వాళ్లందరూ ఉత్సాహంగా ఉన్నారు.
ఆ పిల్లలను చూసిన శిష్య బృందం ‘వీరిది కదా అదృష్టం’ అన్నారు. ‘నిజంగా వారిది అదృష్టమా?’ అని అడిగాడు గురువు. ‘అదృష్టం కాక ఇంకేమిటి గురూజీ! ఇలాంటి తియ్యటి బాల్యం ఎంతమందికి దొరుకుతుంది?’ అని బదులిచ్చారు.
గురువు పక్కనే ఉన్న రావిచెట్టు కింద కూర్చుంటూ ‘మీరు కొద్దిసేపు ఆ పిల్లలతో గడిపి రండి, అంతసేపు నేను నది ప్రవాహాన్ని గమనిస్తూ ఉంటాను’ అన్నాడు. శిష్యులు ఆనందంగా పిల్లల దగ్గరకు వెళ్లారు.
అర్ధగంట గడిచాక శిష్యులు వెనక్కి వచ్చారు. వెళ్లేటప్పుడు విరిసిన మల్లె మొగ్గల్లా ఉన్న వారి ముఖాలు తిరిగి వస్తున్నప్పుడు వాడిన మల్లెల్లా ఉన్నాయి. ఎందుకలా ఉన్నారని ప్రశ్నించాడు గురువు. ‘ఏమి చెప్పమంటారు గురూజీ... ఆ పిల్లలు కడు పేదవారు. సరైన కుటుంబ రక్షణ, పోషణ లేనివారు. ఆనందంగా నీళ్లలో ఆడుకుంటున్నారని భావించాము. కానీ వారు నదిలోకి దూకుతున్నది చిల్లర నాణేల కోసం’ అని చెప్పారు. ఆశ్చర్యంగా వారి ముఖాలకేసి చూశాడు గురువు.
‘ఈ నదికి దగ్గరలో అమ్మవారి గుడి ఉంది. అక్కడికి వచ్చే భక్తులు తమ మొక్కుబడిలో భాగంగా ఈ నదిలో నాణేలు విసురుతారు. వాటికోసం వీరు గాలిస్తూ ఉంటారు.ఆకలి తట్టుకోలేని వీరు ఆ దొరికిన పైసలతో కడుపు నింపుకుంటారు. నాణేలు దొరికిన రోజు పండుగ, లేని రోజు పస్తులే’ అని చెప్పారు. వెంటనే గురువు ‘‘దూరం నుంచి చూస్తే కొండలు చాలా నునుపు గా ఉంటాయి. దగ్గరకు వెళ్లి చూస్తే రాళ్లు, రప్పలు, చెట్లుచేమలు కనిపిస్తాయి. చాలామంది జీవితాలు కూడా అంతే. చూడటానికి చాలా గొప్పగా అనిపిస్తాయి. దగ్గరకు వెళ్లి చూస్తే కానీ వాస్తవ పరిస్థితి అర్థం కాదు’’ అని వివరించాడు.
చూడటానికి, వాస్తవానికి తేడా ఉంటుందని గ్రహించారు శిష్యులు. తమవంతు సాయం చేద్దామని అందరూ కలిసి పిల్లల దగ్గరకు వెళ్లారు. ‘ఆకలిగా ఉన్నప్పుడు మా ఆశ్రమానికి రండి. రోజూ సత్సంగం జరుగుతుంది. సత్సంగం తర్వాత అందరూ కలిసి భోజనం చేద్దాం’ అని చెప్పారు. ఆ పిల్లల ముఖాలు వెండినాణేల్లా మెరిసాయి.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు


