మహతోకు పళ్ల రసమిచ్చి దీక్ష విరమింపజేస్తున్న మంత్రులు దీపికా పాండే, ఇర్ఫాన్ అన్సారీ
అవినీతిరహిత నియామక విధానం కోసం సరికొత్త ఉద్యమం చేస్తాం
జార్ఖండ్‌లో నిరాహార దీక్ష విరమణ వేళ దేవేంద్ర మహతో ప్రకటన
రాంచీ: రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియం వేదికగా దావానలంలా వ్యాపించిన విద్యార్థి ఉద్యమ సెగ తగిలి హేమంత్ సోరెన్ సర్కార్ జార్ఖండ్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించినా తమ నిరసన కొనసాగుతుందని ఉద్యమనాయకుడు, 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో స్పష్టంచేశారు. పరీక్షల రద్దు తదితర ప్రధాన డిమాండ్లకు సోరెన్ సర్కార్ అంగీకరించడంతో మహతో సోమవారం అర్ధరాత్రి తన నిరాహార దీక్షను విరమించారు. ఆరుగురు దీక్ష చేస్తుండగా ఆయనతోపాటు ప్రేమ్ నాయక్, ఉమే హబీబాలు దీక్ష విరమించారు. రాహుల్ క్రాంతి, సబితా కుమారి, రూపేశ్ పాల్ దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించాక మహతో మీడియాతో మాట్లాడారు.
‘‘ఆపింది నిరాహార దీక్ష మాత్రమే. నిరసనోద్యమం కాదు. పరీక్షల రద్దు డిమాండ్లు నెరవేరిన నేపథ్యంలో ఇకపై ఉద్యోగ నియామక బాధ్యతలు చూసే జేపీఎస్సీ, జేఎస్‌ఎస్సీల్లో సంస్కరణల కోసం ‘జేపీఎస్సీ, జేఎస్‌ఎస్సీ అభ్యర్థి సంస్కరణల మంచ్’ఆధ్వర్యంలో సరికొత్త ఉద్యమం ప్రారంభిస్తాం. పరీక్షల రద్దు నిజంగా విద్యార్థుల విజయమే. అయితే ఇంతటితో నిరసనోద్యమం ఆగిపోదు. అవినీతిరహిత ఉద్యోగ నియామక విధానం కోసం ముసాయిదా పత్రం సిద్ధంచేశా. ప్రశ్నపత్రాల లీకేజీల నివారణతోపాటు కఠినమైన నిబంధనల అమలు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడం వంటి ప్రతిపాదనలతో డ్రాఫ్ట్ బ్లూప్రింట్ రూపొందించా. ఫైనాన్షియల్ ఆడిట్ చేస్తామంటే సరిపోదు. ప్రతి పరీక్షను ప్రతి దశలో క్షుణ్ణంగా సరిచూసుకుని ఆడిటింగ్ చేయాలి.
పరీక్ష నిర్వహించాక ఏవేవో తప్పిదాలు, అక్రమాలు జరిగాయనే కారణంతో పరీక్షను రద్దుచేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అక్రమాలకు కఠిన శిక్షలు పడేలా నూతన చట్టం తీసుకురావాలి’’అని అన్నారు. ఉద్యమవేదిక వద్ద పలువురు పరీక్షార్థులు సైతం తమ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ‘‘సీఐడీ, సిట్ దర్యాప్తునకు బదులు సీబీఐ విచారణ జరపాలన్న మా డిమాండ్ ఇంకా నెరవేరలేదు. ఇందుకోసం సైతం పోరాటం కొనసాగుతుంది’’అని ఉద్యమకారులు వ్యాఖ్యానించారు. వీళ్లకు శాసనసభలో విపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు బాబూలాల్ మరాండీ తన మద్దతు ప్రకటించారు.
డిమాండ్ల సాధనలో విజయం సాధించిన విద్యార్థులను లద్దాఖ్ సామాజికవేత్త, జంతర్‌మంత్‌లో ఇటీవల నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్‌చుక్ అభినందించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్‌సైతం విద్యార్థులను అభినందించారు. మరోవైపు గత నియామక పరీక్షల ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మంగళవారం సైతం ఆందోళన కొనసాగించారు. రాంచీలోని రాష్ట్ర సెక్రటేరియట్ ముందు ధర్నాకు దిగారు. ఎగ్జామినేషన్ రద్దు నిర్ణయంపై సీఎం పునరాలోచన చేయాలని కోరారు.


