
ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), తెలంగాణ ప్రభుత్వ చొరవ కార్యక్రమం వి హబ్ ఫౌండేషన్ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం, నిధుల సమీకరణలో మహిళా పారిశ్రామిక వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమక్షంలో హైదరాబాద్‌లో ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్, వి హబ్ ఫౌండేషన్ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. మధ్య జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వి హబ్ ఫౌండేషన్ తో కలిసి ఎన్ఎస్ఈ మదుపరుల అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళలలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది. మహిళల నేతృత్వంలోని పరిశ్రమలకు నిధుల సమీకరణ, లిస్టింగ్ ప్రక్రియలో మార్గనిర్దేశం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఎఫ్ఎస్ఐ రంగంలో స్టూడెంట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తుంది.
2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు ఎన్ఎస్ఈ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 14 భాషలలో 14,679 మదుపరుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. వీటి ద్వారా 8 లక్షలకు పైగా పెట్టుబడి కార్యకలాపాల్లో పాల్గొనేవారు చేరారు. స్టూడెంట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కింద వివిధ రాష్ట్రాలలో 7500 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. అలాగే, వివిధ రంగాలకు చెందిన 615 కంపెనీలు ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ అయ్యాయి. సమిష్టిగా రూ. 17,083 కోట్లకుపైగా నిధులు సమీకరించాయి. ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 1,80,000 కోట్లు.