నెస్లే బోనస్‌ బొనాంజా | Nestle India has also announced that the bonus shares | Sakshi
Sakshi News home page

నెస్లే బోనస్‌ బొనాంజా

Jun 27 2025 6:03 AM | Updated on Jun 27 2025 8:25 AM

Nestle India has also announced that the bonus shares

వాటాదారులకు తొలిసారి ఉచిత షేర్లు 

2024లో షేర్ల ముఖ విలువ విభజన 

జూలై 4న రూ. 10 డివిడెండ్‌ చెల్లింపు 

న్యూఢిల్లీ: సుప్రసిద్ధ మ్యాగీ, నెస్కెఫే, కిట్‌కాట్‌ బ్రాండ్ల ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా కంపెనీ చరిత్రలోనే తొలిసారి బోనస్‌ షేర్లకు తెరతీసింది. దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాక కంపెనీ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో ఉచితంగా షేర్లను జారీ చేయనుంది. బోనస్‌ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. వెరసి వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని బోనస్‌గా కేటాయించనుంది. అయితే ఇందుకు రికార్డ్‌ డేట్‌ను తదుపరి ప్రకటించనున్నట్లు తెలియజేసింది. 

నెస్లే ఇండియా ఇంతక్రితం 2024 జనవరిలో షేర్ల ముఖ విలువను విభజించింది. రూ. 10 ముఖ విలువను రూ. 1 ముఖ విలువకు కుదించింది. తదుపరి కంపెనీ ఈ నెల 19న తొలిసారి బోనస్‌ షేర్ల అంశాన్ని ప్రతిపాదించింది. 26న నిర్వహించనున్న సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం)లో డైరెక్టర్ల బోర్డు బోనస్‌ షేర్ల ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో గురువారం(26న) బోనస్‌ షేర్ల జారీకి బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చనట్లు కంపెనీ చైర్మన్, ఎండీగా పదవీ విరమణ చేయనున్న సురేష్‌ నారాయణ్‌ వెల్లడించారు.

 అంతేకాకుండా ప్రతీ షేరుకీ రూ. 10 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించేందుకు నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇందుకు జూలై 4 రికార్డ్‌ డేట్‌గా కంపెనీ ప్రకటించింది. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 7న షేరుకి రూ. 14.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించింది. కాగా.. బోనస్‌ షేర్లతో వాటాదారులందరూ ప్రధానంగా 5 షేర్ల కంటే తక్కువగల 1.6 లక్షలమంది చిన్న ఇన్వెస్టర్లు లబ్ధి్ద పొందనున్నట్లు నారాయణ్‌ పేర్కొన్నారు.  
బోనస్‌ వార్తల నేపథ్యంలో నెస్లే ఇండియా షేరు 1% బలపడి రూ. 2,430 వద్ద ముగిసింది. 

మ్యాగీ సంక్షోభం 
2015లో అమ్మకాలపై నిషేధ సంక్షోభాన్ని ఎదుర్కొన్న మ్యాగీ తదుపరి దశలో మరింత బలపడింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాలలో 7 శాతం వాటాను మ్యాగీ ఆక్రమిస్తున్నట్లు కంపెనీకి దశాబ్ద కాలం సేవలందించిన నారాయణ్‌ వెల్లడించారు. మ్యాగీ సంక్షోభం తరువాత నెస్లే ఇండియా ఎండీగా 2015 ఆగస్ట్‌ 1న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కాలంలో కంపెనీ వివిధ కేటగిరీలలో 150 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. ఈకామర్స్‌ చానళ్ల ద్వారా 8 శాతం అమ్మకాలు నమోదవుతున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలలో నెస్లే ఇండియా వాటా అత్యధికంకావడం గమనార్హం!  

Advertisement
 
Advertisement
Advertisement