
తొలిసారిగా బోనస్ ఇష్యూ 1:1 నిష్పత్తిలో జారీ
రూ. 5 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్
క్యూ1లో లాభం రూ. 16,258 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ షేర్‌హోల్డర్లకు బంపర్ బొనాంజా ప్రకటించింది. తొలిసారిగా బోనస్ షేర్లు జారీ చేయనుంది. 1:1 నిష్పత్తిలో షేరు ఒక్కింటికి ఒక షేరు చొప్పున కేటాయించనుంది. ఇందుకోసం ఆగస్టు 27ని రికార్డు తేదీగా నిర్ణయించారు. ఇష్యూని బోర్డు ఆమోదించిన రెండు నెలల్లోగా, అంటే సెపె్టంబర్ 18లోగా బోనస్ షేర్లు క్రెడిట్ అవుతాయని బ్యాంకు వెల్లడించింది.
సుమారు రూ. 766.79 కోట్ల విలువ చేసే షేర్లను బ్యాంకు జారీ చేయనుంది. జూన్ క్వార్టర్ ఆఖరు నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ. 2 లక్షల వరకు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ గల చిన్న రిటైల్ షేర్‌హోల్డర్లు 36 లక్షల పైగా ఉన్నారు. వీరి వాటా సుమారు 10.32 శాతం వరకు ఉంటుంది. గతంలో 2011లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 10 ముఖ విలువ చేసే షేర్లను రూ. 2 ముఖ విలువ చేసే అయిదు షేర్లుగా విభజించింది.
ఆ తర్వాత 2019లో వాటిని రూ. 1 ముఖ విలువ చేసే రెండు షేర్లుగా విడగొట్టింది. కంపెనీ షేరు ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 10 శాతం పెరిగి బీఎస్‌ఈలో ప్రస్తుతం రూ. 1,957 వద్ద ఉంది. బీఎస్‌ఈ రికార్డుల ప్రకారం బ్యాంక్ ఇప్పటివరకు ఎన్నడూ బోనస్ షేర్లు ప్రకటించలేదు.
2026 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై రూ. 5 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. దీనికి జూలై 25 రికార్డు తేదీగా ఉంటుంది. ఆగస్టు 11న బ్యాంక్ డివిడెండ్ చెల్లిస్తుంది. 2024 మేలో రూ. 19.5 చొప్పున తుది డివిడెండ్ ఇచ్చిన బ్యాంకు, గత నెలలో రూ. 22 చొప్పున మరోసారి డివిడెండ్ చెల్లించింది. అంతకు ముందు 2022 మేలో రూ. 15.5 చొప్పున, 2023 మేలో రూ. 19 చొప్పున డివిడెండ్ ఇచి్చంది.
కన్సాలిడేటెడ్ లాభం స్వల్పంగా డౌన్..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 16,258 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది క్రితం క్యూ1లో నమోదైన రూ. 16,475 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.31 శాతం తక్కువ. మరోవైపు, స్టాండెలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం రూ. 16,174 కోట్ల నుంచి సుమారు 12 శాతం వృద్ధితో రూ. 18,155.21 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 83,701 కోట్ల నుంచి రూ. 99,200 కోట్లకు ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మాత్రం ఆదాయం రూ. 1.17 లక్షల కోట్ల నుంచి రూ. 1.33 లక్షల కోట్లకు చేరింది.
జూన్ క్వార్టర్ వివరాలు..
→ సమీక్షా కాలంలో మొత్తం వ్యయాలు రూ. 59,817 కోట్ల నుంచి రూ. 63,467 కోట్లకు పెరిగాయి.
→ స్టాండెలోన్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 5.4 శాతం పెరిగి రూ. 31,438 కోట్లకు చేరింది.
→ నికర వడ్డీ మార్జిన్ 3.46 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది.
→ నిర్వహణ వ్యయాలు రూ. 16,621 కోట్ల నుంచి రూ. 17,434 కోట్లకు పెరిగాయి. ఇందులో రూ. 6,158 కోట్ల మేర ఉద్యోగులపై వ్యయాలు, రూ. 11,276 కోట్లు ఇతరత్ర వ్యయాలు ఉన్నాయి.
→ మొత్తం ప్రొవిజన్లు రూ. 2,602 కోట్ల నుంచి రూ. 14,442 కోట్లకు ఎగిశాయి. ఇందులో ‘ఫ్లోటింగ్ ప్రొవిజన్’ రూ. 9,000 కోట్లు ఉన్నట్లు బ్యాంకు తెలిపింది.
→ అసెట్స్ నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి మార్చి త్రైమాసికంతో పోలిస్తే 1.33 శాతం నుంచి 1.4 శాతానికి పెరిగింది.
→ స్థూల రుణాలు రూ. 26,53 లక్షల కోట్లకు (6.7 శాతం వృద్ధి, డిపాజిట్లు 16.2 శాతం పెరిగి రూ. 27.64 లక్షల కోట్లకు చేరాయి.
→ కాసా నిష్పత్తి 38.2 శాతం నుంచి 33.9 శాతానికి తగ్గింది. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు రూ. 6.39 లక్షల కోట్లుగా ఉండగా, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ. 2.98 లక్షల కోట్లుగా ఉన్నాయి.
→ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే హెచ్‌డీబీ ఐపీవో ద్వారా వచి్చన నిధుల కారణంగా ఇతర ఆదాయం రూ. 21,730 కోట్లకు పెరిగింది.
→ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.40 శాతంగా, నికర ఎన్‌పీఏల నిష్పత్తి స్వల్పంగా పెరిగి 0.47 శాతంగా నమోదైంది.
→ అనుబంధ కంపెనీ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఐపీవోకి రావడంతో అందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటా 94.32 శాతం నుంచి 74.19 శాతానికి తగ్గింది.