అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని వివాదాలు వదలడం లేదు. తాజాగా జాతీయ రహదారిపై ఉన్న సత్యదేవుని పాతన నమూనా ఆలయం ప్రసాదం కౌంటర్‌లో భక్తులకు విక్రయించే ప్రసాదం తమకూ కావాలనుకున్నట్టుగా.. ఆ పొట్లాలపై బుధవారం రాత్రి ఎలుకలు పరుగులు తీయడం వివాదాస్పదమైంది. ఎలుకలు ఆ ప్రసాదం తింటూ కనిపించడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వారు ఆ కౌంటర్‌లోని సిబ్బందిని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకపోవడంతో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో దీనిపై దేవదాయ శాఖ మంత్రి పేషీ నుంచి దేవస్థానం అధికారులను శుక్రవారం వివరణ కోరారు. దీంతో, అన్నవరం దేవస్థానం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
పక్కా భవనం లేక..
తిరుపతి వెంకన్న లడ్డూ తరువాత భక్తులు అంతలా ఇష్టపడేది సత్యదేవుని ప్రసాదం. దీనిని రత్నగిరిపై రెండింటితో పాటు కొండ దిగువన తొలి పావంచా, జాతీయ రహదారిపై పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద ఉన్న ప్రసాదం కౌంటర్లలో విక్రయిస్తున్నారు. కొండ దిగువన, జాతీయ రహదారిపై ఉన్న కౌంటర్లలో తెల్లవార్లూ ప్రసాదం విక్రయిస్తారు. కేవలం ప్రసాద విక్రయాల ద్వారానే దేవస్థానానికి ఏటా రూ.25 కోట్ల ఆదాయం వస్తోంది. వ్రతాల తరువాత ఆ స్థాయిలో ప్రసాదం విక్రయాల ద్వారానే ఆదాయం సమకూరుతోంది. రత్నగిరి పైన, తొలి పావంచా వద్ద, నూతన నమూనా ఆలయం వద్ద ప్రసాదం విక్రయాలకు పక్కా భవనాలున్నాయి. కానీ, పాత నమూనా ఆలయం వద్ద మాత్రం మెష్‌తో తయారు చేయించిన కౌంటర్లు మాత్రమే ఉన్నాయి.
నిత్యం ఇవి ప్రసాదాలు కొనుగోలు చేసే భక్తులతో రద్దీగా ఉంటాయి. ఇక్కడ షెల్టర్, క్యూలైన్లు లేకపోవడంతో భక్తులు బయట నిలబడే ప్రసాదం కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ కౌంటర్ల ద్వారానే ఏటా రూ.4 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ ఇక్కడ పక్కా భవనం నిర్మించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రసాదం కౌంటర్లకు రంధ్రాలు ఉండటంతో ఎలుకలు లోపలకు వచ్చి స్వామివారి ప్రసాదం ఆరగిస్తున్నాయి. పగలు రాకపోయినా రాత్రి 10 గంటల తరువాత ఇక్కడ ఎలుకల స్వైరవిహారం కొనసాగుతోంది. అయితే, రాత్రి వేళ ప్రసాదం విక్రయాలు తక్కువగా ఉండటంతో సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది.

దిద్దుబాటు చర్యలు
పాత నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు తిరుగుతున్న వీడియోను దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు పరిశీలించారు. చాలా కాలం నుంచే ఈవిధంగా ఎలుకలు తిరుగుతున్నప్పటికీ అక్కడి సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు రాకుండా నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా పరిగణించారు. అక్కడ ప్రసాదం విక్రయించే ఉద్యోగి వై.త్రిమూర్తులుతో పాటు, సెక్యూరిటీ గార్డును శుక్రవారం సస్పెండ్ చేశారు, ప్రసాదం కౌంటర్‌కు ఉన్న రంధ్రాలను రేకుతో మూసివేయించి, మెష్ చుట్టూ అద్దాలు కూడా బిగించారు.


