
రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తు గురించి ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు లేఖలో తెలియజేశారు. ‘భారతదేశానికి ఏది మంచిదో అదే రిలయన్స్ కు మంచిది’ అనే శీర్షికతో రాసిన ఈ లేఖ కంపెనీ వృద్ధి దేశ పురోగతితో విడదీయరానిదిగా ఉంటుందన్న ముఖేష్ అంబానీ నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.
దేశానికి అమృత కాలం.. రిలయన్స్‌కు పునరుజ్జీవం
డిజిటల్ పేమెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీలో భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించిందని అంబానీ కొనియాడారు. ‘భారతదేశం కేవలం గ్లోబల్ ట్రెండ్‌లను అనుసరించడమే కాదు.. వాటిని సెట్ చేస్తోంది’ అని రాసుకొచ్చారు. 145 కోట్ల భారతీయుల సాధికారతకు కట్టుబడి ఉన్న "జాతీయ సంస్థ"గా రిలయన్స్ అభివృద్ధి చెందుతోందన్నారు.
డీప్-టెక్ పరివర్తన
రిలయన్స్ ఒక కొత్త తరం డీప్-టెక్ ఎంటర్‌ప్రైజ్‌లోకి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కృత్రిమ మేధస్సు, పునరుత్పాదక శక్తి, అడ్వాన్స్ డ్ మెటీరియల్స్, డిజిటల్ ప్లాట్ ఫామ్ వంటి అత్యాధునిక ఆవిష్కరణలపై 1,000 మందికి పైగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఎనర్జీ, రిటైల్ నుంచి టెలికాం, ఎంటర్టైన్మెంట్ వరకు రిలయన్స్ విభిన్న వ్యాపారాల్లో ఈ టెక్నాలజీలను అనుసంధానించనున్నట్లు అంబానీ ఉద్ఘాటించారు.
వ్యాపార పనితీరు ముఖ్యాంశాలు
రిటైల్: రూ.3.3 లక్షల కోట్ల టర్నోవర్, దేశవ్యాప్తంగా 19,340 స్టోర్లు.
జియో: 5జీలో 191 మిలియన్లతో సహా 488 మిలియన్ల యూజర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా నెట్‌వర్క్.
మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్: డిస్నీతో వ్యూహాత్మక భాగస్వామ్యం, రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూయర్షిప్.
ఆయిల్ అండ్ గ్యాస్: అత్యధిక ఇబిటా, బలమైన దేశీయ ప్లేస్మెంట్.
O2C (ఆయిల్ టు కెమికల్స్): క్రమశిక్షణతో కూడిన వ్యయ నిర్వహణ ద్వారా స్థిరమైన పనితీరు.
సుస్థిరత
సుస్థిరత, సర్క్యులర్ ఎకానమీ సూత్రాలు, సమ్మిళిత వృద్ధికి రిలయన్స్ నిబద్ధతను అంబానీ పునరుద్ఘాటించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగాలన్న భారత్ ఆకాంక్షకు మద్దతుగా కంపెనీ తన ఉత్పాదక మౌలిక సదుపాయాలను భవిష్యత్తులో మెరుగుపరుచుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
👉 చదివారా? మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో.. ఎవరీ వైభవ్ తానేజా?