
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆర్థిక భారత సంతతికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వైభవ్ తనేజా. ప్రస్తుతం టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఉన్న ఆయనకు ఇప్పుడు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించారు మస్క్. కొత్తగా ప్రకటించిన రాజకీయ వెంచర్ అయిన అమెరికా పార్టీకి వైభవ్ తానేజాను ట్రెజరర్, రికార్డుల కస్టోడియన్‌గానూ చేశారు. సంప్రదాయ ఐఐటీ-ఐఐఎం నుంచి వచ్చినవాడు కాకపోయినా తనేజా రూ.1,100 కోట్ల వేతన పరిహారాన్ని అందుకుంటున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
తనేజా అధికారికంగా అమెరికా పార్టీ ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు చేపట్టినట్లు ఇటీవల ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ధృవీకరించింది. ఈ పాత్రలో ఆయన రాజకీయ నిధులు, బడ్జెట్ పంపిణీని పర్యవేక్షించడం, ఆర్థిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఇది కార్పొరేట్ ఫైనాన్స్ లో ఆయన ప్రస్తుత పాత్ర నుండి రాజకీయ రంగానికి గణనీయమైన మార్పును సూచిస్తుంది. తనేజాపై ఉన్న నమ్మకంతో మస్క్ ఇప్పుడు తన రాజకీయ పార్టీ ఆర్థిక బాధ్యతలనూ అప్పగించారు.
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మొదలై..
వైభవ్ తనేజా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1999 లో కామర్స్ లో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం చార్టర్డ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. 2006లో అమెరికా వెళ్లి సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (సీసీఏ) అయ్యారు. ఇదే ఆయన ప్రపంచ ఆర్థిక జీవితాన్ని విస్తరించింది.ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ)లో ఆయన దాదాపు 17 సంవత్సరాలు పనిచేశారు. అక్కడాయన 500 మందికి పైగా క్లయింట్లకు రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్, ఐపీఓలను నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన రంగంలోకి ఆయన ప్రవేశం 2016లో సోలార్సిటీతో జరిగింది. ఈ సంస్థ తరువాత టెస్లాలో విలీనమైంది.
రూ.1,100 కోట్ల వేతనం
2017లో టెస్లాలో చేరిన తనేజా క్రమంగా ఎదుగుతూ 2023లో ఆ సంస్థకు సీఎఫ్ఓ అయ్యారు. 2024లో ఆయన 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,157 కోట్లు) వేతన పరిహారం అందుకున్నారు. ఇందులో మూల వేతనంగా అందుకున్నది 4 లక్షల డాలర్లే అయినప్పటికీ మిగిలినది స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ అవార్డుల ద్వారా వచ్చింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా కూడా తానేజా పనిచేశారు.