వాటాదారులకు ఎన్‌ఎస్‌ఈ బొనాంజా! | NSE IPO set to deliver windfall for SBI | Sakshi
Sakshi News home page

వాటాదారులకు ఎన్‌ఎస్‌ఈ బొనాంజా!

Jun 19 2026 12:12 AM | Updated on Jun 19 2026 12:12 AM

NSE IPO set to deliver windfall for SBI

ఐపీవోతో దమానీ, ఎస్‌బీఐకి వేల కోట్ల లాభాలు

దమానీ వాటాల విలువ రూ. 7,817 కోట్లు

హీరో ఎంటర్‌ప్రైజ్‌ ముంజల్‌ షేర్ల విలువ రూ. 2,040 కోట్లు

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్‌ ఇష్యూతో సంస్థలోని వాటాదారులకు వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐతో పాటు దిగ్గజ ఇన్వెస్టరు, డీమార్ట్‌ వ్యవస్థాపకుడు రాధాకిషన్‌ దమానీ, హీరో ఎంటర్‌ప్రైజ్‌ చైర్మన్‌ సునీల్‌ కాంత్‌ ముంజల్‌ మొదలైన వారు గణనీయంగా లాభపడనున్నారు. అన్‌లిస్టెడ్‌ మార్కెట్లో ఎన్‌ఎస్‌ఈ షేరు సుమారు రూ. 2,000 పలుకుతోంది. దీని ప్రకారం చూస్తే దమానీకి ఉన్న 3.91 కోట్ల షేర్ల (ఎన్‌ఎస్‌ఈలో 1.58 శాతం వాటా) విలువ సుమారు రూ. 7,817 కోట్లుగా ఉంటుంది.

తద్వారా ప్రతిపాదిత లిస్టింగ్‌తో అత్యధికంగా లాభపడే వ్యక్తిగత ఇన్వెస్టరుగా ఆయన నిలువనున్నారు. ఇక హీరో ఎంటర్‌ప్రైజ్‌ చైర్మన్‌ సునీల్‌ కాంత్‌ ముంజల్‌కి ఎన్‌ఎస్‌ఈలో 1.02 కోట్ల షేర్ల (0.41 శాతం వాటా) విలువ రూ. 2,040 కోట్లుగా, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎస్‌ గోపాలకృష్ణన్‌కి చెందిన 94.29 లక్షల షేర్ల (0.38 శాతం) విలువ దాదాపు రూ. 1,886 కోట్లుగా ఉండనుంది. ఇక ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టరు సిద్ధార్థ్‌ బాలచంద్రన్‌కి గల 0.38 శాతం వాటా విలువ రూ. 1,863 కోట్లుగా ఉంటుందని అంచనా. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2.47 కోట్ల షేర్లను విక్రయించే యోచనలో ఉంది. వీటి విలువ దాదాపు రూ. 4,950 కోట్లు ఉంటుంది. గణాంకాల ప్రకారం ఒక్కో షేరు కొనుగోలు కోసం సగటున 0.80 పైసలు మాత్రమే వెచి్చంచిన ఎస్‌బీఐకి అత్యధికంగా లబ్ధి చేకూరనుంది. 

రూ. 800 – రూ. 1,050 సరైన ధర..  
అన్‌లిస్టెడ్‌ మార్కెట్లో ఎన్‌ఎస్‌ఈ షేర్ల ధరకి సంబంధించి పీఈ ప్రస్తుతం 50 రెట్లు ఉంటోందని, ఇది చాలా అధికమని ఆల్ఫా ఏఎంసీ సీఈవో రాజేశ్‌ సింగ్లా తెలిపారు. రూ. 800–1,050 శ్రేణి సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు రూ. 30,000 కోట్ల మెగా ఐపీవోకి సంబంధించి సెబీకి ఎన్‌ఎస్‌ఈ ప్రాస్పెక్టస్‌ సమర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశీయంగా అతి పెద్ద ఇష్యూగా ఉన్న రూ. 27,870 కోట్ల హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఐపీవోని మించిన స్థాయిలో ఇది ఉండనుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ఉండే ఈ ఐపీవోలో భాగంగా ప్రస్తుత షేర్‌హోల్డర్లు 14.89 కోట్ల షేర్లను (6 శాతం వాటా) విక్రయించనున్నారు.  

రిస్క్ లున్నాయ్‌.. 
రెగ్యులేటరీ మార్పులు, టెక్నాలజీ వైఫల్యాలు, సైబర్‌దాడులు, ఏఐ నుంచి తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుకి గణనీయంగా రిసు్కలు ఉండొచ్చని సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల్లో ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. ఇటీవల ఈక్విటీ డెరివేటివ్స్‌ నిబంధనలను సెబీ కఠినతరం చేయడంతో క్యాష్, డెరివేటివ్స్‌ సెగ్మెంట్లలో లావాదేవీలు ఇప్పటికే నెమ్మదించాయని, గత ఆర్థిక సంవత్సరం ట్రేడింగ్‌ ఆదాయం తగ్గిందని పేర్కొంది. ఒకవేళ నిబంధనలను మరింత కఠినతరం చేసినా, లావాదేవీలపై పన్నులు పెంచినా, ఇన్వెస్టర్ల తీరు మారి ఇతర అసెట్స్‌ వైపు మళ్లినా.. ట్రేడింగ్‌ పరిమాణం, లాభదాయకతపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది.

ఎవరెవరికి... ఎంతెంత.. 
⇒   మారిషస్‌కి చెందిన ఎంఎస్‌ స్ట్రాటెజిక్‌ 1.6 కోట్ల షేర్ల విక్రయం ద్వారా సుమారు రూ. 3,200 కోట్లు సమకూర్చుకోనుంది. అలాగే, కెనడియన్‌ పెన్షన్‌ ఫండ్‌ సీపీపీఐబీ రూ. 2,375 కోట్లు, ఆరాండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ దాదాపు రూ. 2,250 కోట్లు సమీకరించనుంది.  
⇒   షేర్లను విక్రయిస్తున్న ఇతరత్రా దిగ్గజాల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకి సుమారు రూ. 2,197 కోట్లు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (రూ. 2,178 కోట్లు), జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (రూ. 2,131 కోట్లు), ది న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీకి రూ. 2,100 కోట్లు లభించనున్నాయి. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెరి రూ. 1,200 కోట్లు లభించనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement