యూకే, ఇండియా మధ్య భాగస్వామ్యం
ద్వైపాక్షిక టెక్నాలజీ, వాణిజ్య సహకారం
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమల అసోసియేషన్ నాస్కామ్ యూకే ఫోరమ్‌ను ఆవిష్కరించింది. తద్వారా రెండు యునైటెడ్ కింగ్‌డమ్(యూకే), భారత్ మధ్య ద్వైపాక్షిక టెక్నాలజీ, వాణిజ్య భాగస్వామ్యాలు మరింత విస్తరించనున్నట్లు పేర్కొంది. దేశీ టెక్నాలజీ పరిశ్రమకు యూకే రెండో పెద్ద మార్కెట్‌కాగా.. వార్షిక ఆదాయం 90 బిలియన్ డాలర్లను మించుతోంది. ఈ నేపథ్యంలో నాస్కామ్ యూకే ఫోరమ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.
భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 56 బిలియన్ డాలర్లుకాగా.. సరీ్వసుల వాణిజ్యం 33 బిలియన్ డాలర్లుగా అంచనా. 2030కల్లా రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపునకు పెంచుకోవాలనేది స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) లక్ష్యంకాగా.. డిజిటల్, టెక్నాలజీ ఆధారిత వృద్ధి కీలకంగా నిలవనుంది.
సాంకేతిక భద్రతా కార్యాచరణ(టీఎస్‌ఐ)లో భాగంగా రెండు దేశాల మధ్య ఏఐ సాంకేతిక సహకారం మరింత ముందుకు సాగడంలో నాస్కామ్ యూకే ఫోరమ్ ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఏఐ వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూకే సిటిజన్ సరీ్వసులను పెంచుకోవడంలో ఉపయోగపడనున్నట్లు నాస్కామ్ పేర్కొంది. ఏఐకు సిద్ధపడటం, మానవవనరుల నైపుణ్య పెంపు, డిజిటల్‌వైపు ఎస్‌ఎంఈల ప్రయాణం(ట్రాన్స్‌ఫార్మేషన్)సహా బాధ్యతాయుత ఏఐ వినియోగం, ఇన్నోవేషన్ విధానాలను పంచుకోవడం ద్వారా రెండు దేశాలు లబ్ది పొందనున్నట్లు అభిప్రాయపడింది.


