20 ఏళ్ల దాకా వేచి చూడాల్సిందే
పార్లమెంట్‌కు ప్రతిపాదనలు సమర్పించిన ప్రభుత్వం
లండన్: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో చట్టబద్ధంగా నివసిస్తున్న వలసదారులకు కొత్త కష్టాలు రాబోతున్నాయి. యూకేలో శాశ్వత స్థిరనివాసిత హోదా(సెటిల్డ్ స్టేటస్) పొందాలంటే ఇకపై 20 ఏళ్లదాకా వేచి చూడాల్సిందే. ఈ హోదా కావాలంటే ఇండెఫ్‌నట్ లీవ్ టు రిమైన్(ఐఎల్‌ఆర్)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐఎల్‌ఆర్‌కు అర్హత సాధించాలంటే తక్కువ వేతనం కలిగిన వలసదారులు 10 ఏళ్లు, ప్రభుత్వం ఇచ్చే నిధులతో ప్రయోజనం పొందుతున్న వలసదారులు 20 ఏళ్లు వేచి చూడాలి.
ఈ మేరకు యూకే ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. హోంశాఖ మంత్రి షబానా మహమూద్ ఈ ప్రతిపాదనలను గురువారం పార్లమెంట్‌కు సమర్పించారు. ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న గడువును పదేళ్లకు పెంచడం గమనార్హం. 2021 తర్వాత యూకేకు చేరుకున్న 10.6 లక్షల మంది వలసదారులకు ఈ నిబంధన వర్తించబోతోంది. యూకేలో శాశ్వతంగా నివసించడం వలసదారుల హక్కు కాదని, అది కొన్ని అర్హతలతో సాధించుకోవాలని మంత్రి షబానా మహమూద్ తేల్చిచెప్పారు.
వలసదారులపై అమెరికా ప్రభుత్వం ఇటీవలి కాలంలో కఠిన అంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రతిపాదన ప్రకారం.. 12 నెలలకంటే తక్కువ కాలం ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనం పొందితే ఐఎల్‌ఆర్ కోసం 15 ఏళ్లు వేచి చూడాలి. 12 నెలల కంటే ఎక్కువ కాలం ప్రయోజనం పొందితే 20 ఏళ్లు వేచి చూడాలి. 2021 నుంచి 2024 మధ్య కొత్తగా 20.6 లక్షల మంది యూకేకు వలసదారులుగా వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెటిల్డ్ స్టేటస్ లభిస్తే యూకే పౌరసత్వం కూడా లభించడానికి అవకాశం ఉంటుంది.


