వెనిజువెలా వాణిజ్యంపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం చైనా, రష్యా, ఇరాన్‌లతో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా చమురు వెలికితీతలో కేవలం యుఎస్ మాత్రమే భాగస్వామిగా ఉండాలని హెచ్చరించారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు ఈ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని కొద్దిరోజుల క్రితం ట్రంప్ సర్కార్ బంధించిన సంగతి తెలిసిందే. అయితే అదేశం నుంచి డ్రగ్స్ అధికమెత్తంలో అమెరికాకు వస్తున్నాయని అందుకే శాంతిభద్రతల కోసం ఆయనని బంధించామని ట్రంప్ చెబుతున్నా.. అక్కడి చమురునిల్వలను స్వాధీనం చేసుకోవాడానికే ట్రంప్ ఈ ప్లాన్ వేశారని చాలా మంది భావించారు. తాజాగా ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో ఇది నిజం అనే భావన కలుగుతుంది.
ప్రస్తుతం వెనిజువెలాకు తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆప్రభుత్వానికి ట్రంప్ ఆల్టిమేటం జారీచేశారు. "మెట్టమెుదటగా వెనిజువెలా చైనా, రష్యా, ఇరాన్,క్యూబాలతో ఉన్న వాణిజ్య సంబంధాలన్ని తెంచుకోవాలి. అమెరికాను తన ఆయిల్ ప్రొడక్షన్‌లో భాగస్వామిగా అంగీకరించాలి. అధిక మెత్తంలో చమురు అమెరికాకు అమ్మేప్పుడు సానుకూలంగా వ్యవహరించాలి" అని తెలిపారు.
అంతేకాకుండా ప్రస్తుతం అమెరికాకు విక్రయిస్తున్న 30మిలియన్ల బ్యారెళ్ల చమురును 50 మిలియన్ బ్యారెళ్లకు పెంచి మార్కెట్ ధరలకు అమెరికాకు విక్రయించాలని తెలిపారు. ఆ డబ్బులను వెనిజువెలా ప్రజల సంరక్షణ కోసం అమెరికా వినియోగిస్తుందన్నారు. అమెరికా వర్గాల నివేదిక ప్రకారం కార్‌కస్ తన దగ్గర ఉన్న చమురునిల్వలను అమ్మకపోతే కేవలం వారాల వ్యవధిలోనే ఆర్థికంగా దివాళా తీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


