
భారత్ దీర్ఘకాలిక రుణ రేటింగ్‌ను స్థిరమైన ఔట్‌లుక్‌తో యథాతథంగా ‘బీఏఏ3’గా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉండటం, అంతర్జాతీయంగా వాణిజ్యం, చెల్లింపులకు సంబంధించి మెరుగైన స్థితిలో ఉండటం, తదితర అంశాలు ఇందుకు కారణమని సంస్థ వివరించింది. ఇవన్నీ కూడా అమెరికా టారిఫ్‌ల భారం, తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ఎదురవుతున్న అవాంతరాలు మొదలైన అంతర్జాతీయ ప్రతికూల పవనాలను ఎదుర్కొనే బలాన్ని అందిస్తున్నాయని పేర్కొంది.
దేశీయంగా భారీ మార్కెట్, జనాభా తీరుతెన్నులపరంగా సానుకూలతలాంటి అంశాలు .. అంతర్జాతీయ షాక్‌ల నుంచి దేశీ ఎకానమీకి రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, జీడీపీ వృద్ధి అధిక స్థాయిలో ఉండటం, ఆర్థిక స్థిరీకరణ వంటి అంశాలనేవి భారీ స్థాయిలో ఉన్న ప్రభుత్వ రుణభారాన్ని నెమ్మదిగా తగ్గించుకోవడానికే తోడ్పడతాయే తప్ప ఎకాయెకిన తగ్గించుకోవడానికి ఉపయోగపడకపోవచ్చని తెలిపింది. పైగా వినిమయాన్ని పెంచే దిశగా ఇటీవల తీసుకున్న చర్యల వల్ల ప్రభుత్వ ఆదాయానికి కొంత గండి పడుతుందని, దీంతో రుణభారాన్ని అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారొచ్చని మూడీస్ వివరించింది.
ఇటీవలే ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ 18 ఏళ్లలో తొలిసారిగా భారత్ సార్వభౌమ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ‘ట్రిపుల్‌బీ మైనస్’ నుంచి ట్రిపుల్ బీ’కి పెంచింది. అటు జపాన్‌కి చెందిన రేటింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ (ఆర్‌అండ్‌ఐ) కూడా దీర్ఘకాలిక సావరీన్ రేటింగ్‌ను ట్రిపుల్ బీ నుంచి ట్రిపుల్ బీ ప్లస్‌కి పెంచింది. ఇక మారి్నంగ్‌స్టార్ డీబీఆర్‌ఎస్ సైతం ట్రిపుల్ బీ (కనిష్ట) నుంచి ట్రిపుల్ బీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది.
వేగవంతమైన వృద్ధి..
2023–24లో 9.2 శాతంగా నమోదైన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2025 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతానికి నెమ్మదించినా కూడా గత రెండు, మూడేళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న జీ20 దేశంగా భారత్ కొనసాగుతోందని మూడీస్ వివరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ వ్యయాలు పెంచడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, ద్రవ్యపరపతి విధానాన్ని సరళతరం చేయడంపై కేంద్రం దృష్టి పెడుతుండటమనేది దేశీయంగా వినియోగం, పెట్టుబడులు పెరగడానికి దన్నుగా నిలుస్తుందని మూడీస్ తెలిపింది.
ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి
అమెరికా భారీ టారిఫ్‌లను విధించడం వల్ల సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధిపై పడే ప్రతికూల ప్రభావాలు పరిమితంగానే ఉంటాయని పేర్కొంది. అయితే, అధిక విలువను జోడించగలిగే ఎగుమతి ఆధారిత పరిశ్రమగా తయారీ రంగాన్ని తీర్చిదిద్దాలన్న భారత ఆకాంక్షలకి అవరోధాలు కలిగించడం ద్వారా మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపవచ్చని తెలిపింది. ప్రస్తుత దశలో సంప్రదింపుల వల్ల టారిఫ్‌లు తగ్గే అవకాశం ఉందని, దేశీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం గణనీయంగానే ఉండొచ్చని మూడీస్ పేర్కొంది.