ఒక్క రూపాయి జీతం.. ఐటీ కంపెనీ ఫౌండర్‌ ఆనందం | Mindtree Co Founder Subroto Bagchi Calls Re 1 Salary His Lifes Biggest Wealth | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయి జీతం.. ఐటీ కంపెనీ ఫౌండర్‌ ఆనందం

Jul 7 2025 8:38 PM | Updated on Jul 7 2025 8:56 PM

Mindtree Co Founder Subroto Bagchi Calls Re 1 Salary His Lifes Biggest Wealth

జీవితంలో ఎవరైనా విజయం సాధించారనడానికి సంపాదించిన సంపద, బిరుదులు, పేరు ప్రఖ్యాతులతో కొలిచే ప్రపంచంలో, నిజమైన సంపద బ్యాంకు బ్యాలెన్స్‌లకు మించి ఉంటుందని గుర్తు చేశారు ప్రముఖ ఐటీ సంస్థ మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడు సుబ్రతో బాగ్చి. తనకు వార్షిక జీతం ఒక్క రూపాయి వచ్చిందని, అది తన జీవితంలో వెలకట్టలేని సంపదంటూ ఆ చెక్కును సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్‌ పెట్టారాయన.

ఈ చెక్కు ఆయన ఏదైనా కంపెనీకో.. స్టార్టప్ కు అందించిన సేవలకు వచ్చింది కాదు. ఇన్‌స్టిట్యూషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం ఒడిశా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఇది ఆయన చివరి జీతం. ఈ పాత్రలో సుబ్రతో బాగ్చి ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇందుకు ఆయన ఎటువంటి ఆర్థిక ప్రతిఫలాన్ని ఆశించలేదు. ఏడాదికి కేవలం ఒక్క రూపాయిని సింబాలిక్ వేతనంగా స్వీకరించారు.

"ఈ ఒక్క జన్మలో నేనెప్పుడూ వదులుకోలేని అతి పెద్ద సంపద ఏమిటంటే?" అంటూ తన సేవా ప్రయాణాన్ని బాగ్చి వివరించారు. "నేను ప్రభుత్వంతో చేసినందుకు నాకు ఏడాదికి రూ .1 జీతం. ఎనిమిదేళ్లకు 8 చెక్కులు వచ్చాయి. ఇదే నా చివరి జీతం"  అంటూ తన ‘ఎక్స్‌’ పోస్ట్‌లో భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ ఎంతో మందిని హత్తుకుంటోంది. అభినందనలు కురిపిస్తోంది.

సేవతోనే సంతృప్తి
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐటీ, కన్సల్టింగ్ సంస్థ మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడిగా బాగ్చీకి మంచి పేరుంది. ఆయన నాయకత్వం, దార్శనికత, దాతృత్వానికి ప్రశంసలు దక్కాయి. ఎన్ని వేల కోట్లు సంపాదించినా బాగ్చీ సామాజిక సేవలోనే సంతృప్తిని వెతుక్కున్నారు.  సుబ్రతో బాగ్చీ తన సతీమణి సుస్మితతో కలిసి క్యాన్సర్ సంరక్షణ, నైపుణ్య అభివృద్ధి వంటి సేవా కార్యక్రమాల  కోసం వందల కోట్ల రూపాయలను దానమిచ్చారు. ఇప్పుడాయన ఈ చిన్న చెక్కునే తన జీవితానికి అపురూపంగా భావిస్తున్నారంటే ఇదే సేవలో తనకున్న సంతృప్తికి నిదర్శనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement