
ఈరోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కన్నా చిరు వృత్తులు చేసేవారే అధికంగా సంపాదిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై ముంబైకి చెందిన ఆయుషి దోషి అనే న్యాయవాది సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆదాయ అసమానతలు , నైపుణ్యం కలిగిన కార్మికుల నిర్వచనం గురించి విస్తృతమైన చర్చకు దారితీసింది.

స్థానికంగా 'మహారాజ్' అని పిలిచే ఆమె ఇంట్లో పనిచేసే వంటమనిషి కార్పొరేట్ ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఒక్కో ఇంట్లో ఆయన కేవలం 30 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాడు. ఇందుకు ఒక్కో ఇంటికి రూ.18,000 సంపాదిస్తున్నారు. ఆయన ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని 10-12 ఇళ్లలో పనిచేస్తున్నాడు. అంటే అతని నెలవారీ సంపాదన రూ .1.8 లక్షల నుంచి రూ.2.16 లక్షల మధ్య ఉంటుంది. ఇది చాలా మంది వైట్-కాలర్ నిపుణుల జీతాల కంటే ఎక్కువ.
విజయానికి ఒక రెసిపీ!
దోషి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో వంటమనిషి సమర్థవంతమైన పని నమూనాను హైలైట్ చేశారు. ‘ఒక్కో ఇంటికి రూ.18,000 తీసుకుంటాడు. రోజూ 10-12 ఫ్లాట్లలో పనిచేస్తాడు. ఒక్కో ఇంటికీ 30 నిమిషాలే కేటాయిస్తాడు. భోజనం, టీలు ఉచితం. సమయానికి పేమెంట్’ అంటూ ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అయితే అందరు వంటవాళ్లూ ఇలాగే సంపాదిస్తున్నారని కాదు.. అద్భుతమైన నైపుణ్యం, దశాబ్దానికి పైగా నిర్మించుకున్న పేరు ఆయనకు ఎక్కువ సంపాదనను తెచ్చిపెడుతోంది. మరోవైపు చాలా మంది వంటవాళ్ల సంపాదన రూ.10,000 నుంచి రూ.12,000 మించడం లేదని, వేగం, పరిశుభ్రత, స్థిరత్వానికి పేరుగాంచిన వారు గణనీయంగా ఎక్కువ సంపాదించవచ్చని దోషి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ పోస్టుపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి.