
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌టెక్ సీఈవో సి.విజయకుమార్ రికార్డు స్థాయి వేతనం అందుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన 10.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.94.6 కోట్లు) సంపాదించారు. ఇది భారతీయ ఐటీ రంగంలో ఎగ్జిక్యూటివ్‌లు పొందుతున్న అత్యధిక వేతనంగా నిలిచింది.
విజయకుమార్ వేతనం పెద్ద పోటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఛీప్‌ల సంపాదనను సైతం అధిగమించింది. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రస్తుత వేతనాన్ని 71 శాతం పెంచి 18.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.154 కోట్లు) పెంచుకోవడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది.

ఇదే సమయంలో టీసీఎస్ సీఈఓ కృతివాసన్ వేతనం రూ.26.52 కోట్లు కాగా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం రూ.80.62 కోట్లుగా ఉంది. అలాగే విప్రో సీఈఓ శ్రీనివాస్ పలియా ఆర్జన సుమారు రూ.53.64 కోట్లు, టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి సంపాదన రూ.53.9 కోట్లుగా ఉన్నాయి.
2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ అందుకున్న మొత్తం పరిహారంలో మూల వేతనం 1.96 మిలియన్ డాలర్లు కాగా పనితీరు ఆధారిత బోనస్ 1.73 మిలియన్ డాలర్లుగా ఉందని హెచ్‌సీఎల్‌టెక్ వార్షిక నివేదిక తెలిపింది.

ఆయన సంపాదనలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు 6.96 మిలియన్ డాలర్ల విలువైన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్‌యూలు) నుంచే వచ్చింది. ఇవికాక బెనిఫిట్స్, పెర్క్విసైట్స్ కింద అదనంగా మరో 0.20 మిలియన్ డాలర్లు లభించాయి.
2016లో హెచ్‌సీఎల్‌టెక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ అమెరికాలో ఉంటూ తన రెమ్యూనరేషన్‌ను కంపెనీకి చెందిన అమెరికా అనుబంధ సంస్థ హెచ్‌సీఎల్ అమెరికా ఇంక్ నుంచి తీసుకుంటున్నారు.
👉ఇది చదివారా? కాగ్నిజెంట్‌లో జీతాల పెంపు.. సీఎఫ్‌వో కీలక ప్రకటన
