
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల జీతాల పెంపుపై కీలక ప్రకటన చేశారు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) జతిన్ దలాల్. 2025 ద్వితీయార్థంలో చాలా మంది ఉద్యోగులకు వేతన పెంపును అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని, అయితే స్థూల ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో వేతన పెంపు తేదీని ఇంకా నిర్ణయించలేదని జతిన్ దలాల్ జూలై 31న కంపెనీ క్యూ 2 ఎర్నింగ్ కాల్ సందర్భంగా చెప్పారు.
న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ సాధారణంగా ఆగస్టు 1 నుంచి వార్షిక వేతన పెంపును ప్రారంభిస్తుంది. అయితే ఈ ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటి సంస్థలతో కలిసి కాగ్నిజెంట్ వేతన ఇంక్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వేతన పెంపును అమలు చేసిన ఏకైక ప్రధాన టైర్-1 ఐటీ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది.
స్థూల ఆర్థిక వాతావరణం, దాని చుట్టూ ఉన్న అనిశ్చితి దృష్ట్యా వేతనాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని దలాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమలు చేసే వేతన పెంపులో మెజారిటీ ఉద్యోగులను కవర్ చేయాలనేది తమ ప్రయత్నమని చెప్పారు. అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ, కాగ్నిజెంట్ స్థిరమైన హెడ్ కౌంట్ వృద్ధిని నివేదిస్తూనే ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ వరుసగా 7,500 మంది ఉద్యోగులను చేర్చుకుంది, మొత్తం ఉద్యోగుల సంఖ్య 343,800 కు చేరుకుంది. అట్రిషన్ గత త్రైమాసికంతో పోలిస్తే 60 బేసిస్ పాయింట్లు తగ్గి పన్నెండు నెలల ప్రాతిపదికన 15.2 శాతానికి తగ్గింది.