
టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్ సొల్యూషన్ల దేశీ దిగ్గజం ఎల్‌టీఐమైండ్‌ట్రీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 1,254 కోట్లను అధిగమించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,134 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం 8 శాతం పుంజుకుని రూ. 9,841 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 9,143 కోట్ల టర్నోవర్ నమోదైంది. జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 83,889కు చేరింది. ఇసాప్‌లో భాగంగా ఉద్యోగుల సంక్షేమ నిధికి 67,252 షేర్లను కొత్తగా జారీ చేసేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిని తదుపరి దశలో అర్హతగల ఉద్యోగులకు బదిలీ చేయనుంది.
ఇండియన్ హోటల్స్ లాభం జూమ్
ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(ఐహెచ్‌సీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 27 శాతం జంప్‌చేసి రూ. 329 కోట్లను అధిగమించింది.
గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 260 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,596 కోట్ల నుంచి రూ. 2,102 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,268 కోట్ల నుంచి రూ. 1,662 కోట్లకు పెరిగాయి. వరుసగా 13వ క్వార్టర్‌లోనూ రికార్డ్ ఫలితాలు సాధించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ పేర్కొన్నారు.
గైడెన్స్‌కు అనుగుణంగా ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించినట్లు తెలియజేశారు. హోటళ్ల విభాగం నుంచి 14 శాతం అధికంగా రూ. 1,814 కోట్లు లభించగా.. 31.4 శాతం ఇబిటా మార్జిన్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ కాలంలో 12 ఒప్పందాలు కుదుర్చుకోగా.. కొత్తగా 6 హోటళ్లను ప్రారంభించినట్లు తెలియజేశారు. హోటళ్ల పోర్ట్‌ఫోలియో 390కు చేరినట్లు వెల్లడించారు.