మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత? | Microsoft Layoffs 2026, Thousands In Xbox, Sales And Consulting May Be Affected, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత?

Jul 1 2026 9:45 AM | Updated on Jul 1 2026 10:05 AM

Microsoft Layoffs 2026 Xbox Sales Consulting Hit Amid Rising AI Costs

ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోమారు భారీగా ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ, త్వరలోనే కొత్త రౌండ్ లే-ఆఫ్స్‌ను ప్రకటించవచ్చని ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ ఇన్‌సైడర్ అంచనా వేసింది. ముఖ్యంగా కంపెనీకి చెందిన ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగంతో పాటు సేల్స్, కన్సల్టింగ్ విభాగాల్లోని వేలాది ఉద్యోగాలపై ఈ ప్రభావం పడనుందని పేర్కొంది.

గత ఏడాది (2025) మే నెలలో 6,000 మందిని, జులైలో సంస్థ మొత్తం సిబ్బందిలో 4 శాతానికి సమానమైన 9,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి జరగబోయే కోతలు కొంత తక్కువగానే ఉండవచ్చని సమాచారం. కంపెనీకున్న మొత్తం 2,20,000 మంది ఉద్యోగుల్లో ఈ తాజా లే-ఆఫ్స్ ప్రభావం 2.5% కంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నిర్ణయం?

సాధారణంగా మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆర్థిక సంవత్సరాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం నాటికి ఈ ఉద్యోగాల కోతపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ గడువులో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ ప్రక్రియలో ప్రభావితమయ్యే కొంతమంది ఉద్యోగులకు అంతర్గతంగా వెంటనే కొత్త బాధ్యతలను అప్పగించే యోచనలో కూడా కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఏఐపై పెరుగుతున్న ఖర్చు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఏఐ అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్ సేవల విస్తరణకు వ్యయం పెరుగుతుండటంతో ఇతర విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు భవిష్యత్తులో ఏఐ సాఫ్ట్‌వేర్ సాంకేతికత వల్ల కొన్ని సంప్రదాయ సాఫ్ట్‌వేర్ సేవల అవసరం తగ్గుతుందనే ఆందోళనలతో అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గత నెలలో మైక్రోసాఫ్ట్ స్టాక్ సుమారు 17 శాతం మేర క్షీణించింది.

గేమింగ్ విభాగంలో రీసెట్ వ్యూహం

మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగంలో ఈ మార్పులు ఊహించినవేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్స్‌బాక్స్ నూతన సీఈఓ ఆశా శర్మ ఇటీవల ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో.. వ్యాపారాన్ని సరికొత్తగా రీసెట్ చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగానే గేమింగ్ విభాగంలో ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

స్వచ్ఛంద పదవీ విరమణ అస్త్రం

గత ఏడాదితో పోలిస్తే ఈసారి లే-ఆఫ్స్ ప్రభావం తగ్గడానికి కంపెనీ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అమెరికాలోని ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ ఒక ప్రత్యేక బై-అవుట్ ఆఫర్‌ను ప్రకటించింది. వయస్సు, సర్వీస్ కాలం ఆధారంగా రూపొందించిన ఈ పథకానికి అమెరికాలోని సంస్థ మొత్తం వర్క్‌ఫోర్స్ (1,25,000 మంది)లో సుమారు 7 శాతం (దాదాపు 9,000 మంది) ఉద్యోగులు అర్హత సాధించారు.

కంపెనీ అంచనాలకు అనుగుణంగానే అర్హులైన వారిలో మూడింట ఒక వంతు మంది ఉద్యోగులు ఈ స్వచ్ఛంద విరమణను ఎంచుకున్నారు. ఫలితంగా సంస్థకు సహజంగానే ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అయితే, కమీషన్ ఆధారిత వేతనాలు పొందే సేల్స్ ఉద్యోగులకు మాత్రం ఈ వీఆర్ఎస్ ఆఫర్ వర్తించలేదని కంపెనీ అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైంది. అందుకే ఇప్పుడు నేరుగా సేల్స్, కన్సల్టింగ్ విభాగాల్లో ఉద్యోగాల తగ్గింపునకు మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement