నన్ను జాబ్ నుంచి తొలగించండి.. మెటా ఉద్యోగిని | Meta Employee Goes Viral After Volunteering To Be Laid Off Amid AI Push | Sakshi
Sakshi News home page

నన్ను జాబ్ నుంచి తొలగించండి.. మెటా ఉద్యోగిని

May 24 2026 9:14 PM | Updated on May 24 2026 9:27 PM

Meta Employee Goes Viral After Volunteering To Be Laid Off Amid AI Push

మెటా సంస్థ ఇటీవలే భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో జూలీ బోన్ అనే ఉద్యోగిని కూడా ఉన్నారు. అయితే.. ఈమె తనకు తానుగానే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు.. లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

జూలీ బోన్ కంపెనీలో జరుగుతున్న ఉద్యోగాల కోతల్లో తన పేరును కూడా చేర్చాలని స్వయంగా కోరినట్లు వెల్లడించింది. ఈమె సంస్థలో ఆరేళ్లు పనిచేసింది. అయితే ఇప్పుడు ఉద్యోగాన్ని వదులుకోవాలనుకోవడం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొంది. చాలా కాలంగా కంపెనీ లక్ష్యాలు, తన వ్యక్తిగత ఆశయాలు వేర్వేరు దారుల్లో సాగుతున్నాయని ఆమె భావించింది. అందుకే తన వ్యక్తిగత జీవితానికి సరైన సమయం వచ్చిందని భావించి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకుందన్నారు.

అంతేకాకుండా.. తాను స్వచ్ఛందంగా బయటకు వస్తే సంస్థలో కొనసాగాలని కోరుకునే మరో ఉద్యోగికి అవకాశం దక్కవచ్చనే ఆలోచన కూడా తనలో ఉందని పేర్కొన్నారు. మెటాలో పని చేసిన కాలంలో ఏఐ ఆధారిత నైపుణ్యాలను కూడా నేర్చుకున్నానని జూలీ వెల్లడించింది. కొత్త ఆలోచనలను రూపొందించడానికి, కోడింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఏఐ టూల్స్ ఉపయోగించడం నేర్చుకున్నానని తెలిపింది.

ప్రస్తుతం మెటాలో 'AI-first' విధానం అమల్లో ఉందని, ఉద్యోగులు ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆమె వివరించింది. అయితే.. ఏఐ నేర్చుకోవడం మాత్రమే ఉద్యోగ భద్రతకు హామీ కాదని జూలీ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను రక్షించాలంటే.. సంస్థలు, ఉద్యోగులు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నా, మానవ సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంస్కృతిక అవగాహన వంటి అంశాలు ఎంతో ముఖ్యమని జూలీ నమ్మకం. మెటాలో చేసిన పనుల్లో ముఖ్యంగా బ్రాండ్ వాయిస్, లోకలైజేషన్ రంగాల్లో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్న జూలీ, భవిష్యత్తులో సృజనాత్మకతకు, ఎడిటోరియల్ తీర్పుకు, స్పష్టమైన కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చే సంస్థల్లో అవకాశాలను వెతుకుతానని వెల్లడించింది. మొత్తం మీద ఈమె వ్యాఖ్యలు.. ప్రస్తుతం ఏఐ ప్రభావం, ఉద్యోగ భద్రత, టెక్నాలజీ రంగంలో మారుతున్న పని సంస్కృతి వంటి అంశాలపై విస్తృత చర్చకు దారితీశాయి.

Advertisement
 
Advertisement
Advertisement