
ఫేస్‌బుక్ ప్రైవసీ ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో మెటాలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, డైరెక్టర్లు వ్యవహరించిన తీరుపై షేర్ హోల్డర్ల బృందంతో బిలియన్ డాలర్ల దావాను పరిష్కరించడానికి మార్క్ జుకర్‌బర్గ్ అంగీకరించినట్లు తెలిసింది. షేర్ హోల్డర్లు 8 బిలియన్ డాలర్లు (6 బిలియన్ పౌండ్లు-సుమారుగా రూ.68 వేల కోట్లు) నష్టపరిహారంగా కోరుతున్నారు. అయితే వారికి ఏమేరకు ముట్టజెబుతామని చెప్పారో మాత్రం తెలియరాలేదు.
డెలావేర్ కోర్టులో జరిగిన విచారణ రెండో రోజుకు చేరుకోనున్న నేపథ్యంలో షేర్ హోల్డర్ల తరఫు న్యాయవాది గురువారం ఈ సెటిల్‌మెంట్ అమౌంట్‌ను ప్రకటించారు. దీనిపై స్పందించేందుకు మెటా నిరాకరించింది. జుకర్‌బర్గ్ చర్యలు కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌కు దారితీశాయని, ఇందులో మిలియన్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను లీక్ చేసి ఒక రాజకీయ కన్సల్టింగ్ సంస్థ ఉపయోగించిందని మెటా షేర్ హోల్డర్లు ఆరోపించారు.
ఇదీ చదవండి: అడుగు దూరంలో ట్రేడ్ డీల్
వినియోగదారుల గోప్యతా ఉల్లంఘనల క్లెయిమ్‌లను పరిష్కరించడానికి కంపెనీ చెల్లించాల్సిన జరిమానాలు, చట్టపరమైన ఖర్చులను 8 బిలియన్ డాలర్లకుపైగా తిరిగి చెల్లించేలా మెటాను ఆదేశించాలని వాటాదారులు న్యాయమూర్తిని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మిలియన్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను యాక్సెస్ చేసినట్లు వెల్లడైన తరువాత 2018లో వాటాదారులు దావా వేశారు.