
భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు అడుగు దూరంలోనే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్‌హౌజ్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌తో ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని చెప్పారు. బ్రాడ్ కాస్టర్ రియల్ అమెరికాస్ వాయిస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే వాణిజ్య ఒప్పందాల గురించి అడిగినప్పుడు భారత్‌తో ఒప్పందం త్వరలో కొలిక్కి వస్తుందని తెలిపారు.
భారీ సుంకాలు అమల్లోకి రాకముందే ఒక ఒప్పందానికి రావాలనే లక్ష్యంతో భారత్, అమెరికా కొన్ని నెలలుగా తీవ్ర చర్చలు జరుపుతున్నాయి. విస్తృత వాణిజ్య విధానంలో భాగంగా ఏప్రిల్ 2న భారత వస్తువులపై 27 శాతం సుంకాలను ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత జులై 9 వరకు సుంకాలను నిలిపివేయగా, ఆ తర్వాత అమెరికా ఆగస్టు 1 వరకు గడువును పొడిగించింది.
యూఎస్‌లో ప్రత్యేక బృందం
ఈ ఒప్పందంపై చర్చల కోసం భారత ప్రతినిధి బృందం అమెరికాలో ఉందని భారత ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. గత నెలలో భారత అధికారుల బృందం మరో దఫా చర్చల కోసం వాషింగ్టన్ పర్యటనను పొడిగించడంతో ఈ ఒప్పందంపై ప్రశ్నలు తలెతుతున్నాయి. అయితే ఈ డీల్‌పై ఇరు పక్షాలు ఆశావహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా యూఎస్ ఉత్పత్తులు కొన్ని భారత మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.
ఇదీ చదవండి: ముగిసిన టీసీఎస్ బెంచ్ పాలసీ గడువు
ఇండోనేషియా తరహాలోనే?
ఇండోనేషియాతో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం తరహాలోనే భారత్‌తో ఒప్పందం ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గాల మధ్య చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే, భారత్ డెడ్ లైన్ల ఆధారంగా మరిన్ని చర్చలు జరపదని, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే ఒప్పందాలను మాత్రమే చేసుకుంటుందని ఆయన ఇటీవల చెప్పారు. ఇప్పటివరకు ద్వైపాక్షిక వాణిజ్యం 190 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ సంఖ్యను రెట్టింపు చేసి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ట్రంప్, మోదీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.