
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 35 రోజుల బెంచ్ పాలసీని అమలు చేస్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. జూన్ 12న ప్రకటించిన ఈ పాలసీ మొదటి విడత జులై 17తో గడువు ముగిసింది. దాంతో ఈరోజు చాలా మంది ఉద్యోగులు సంస్థలో తమ భవిష్యత్తు ఏమిటనే దానిపై ఆందోళన చెందుతున్నారు.
జూన్ 2025లో ప్రవేశపెట్టిన బెంచ్ పాలసీ విధానం ప్రకారం ప్రతి ఉద్యోగి సంవత్సరానికి కనీసం 225 బిల్లింగ్(యాక్టివ్ వర్క్) రోజులను లాగిన్ చేయాలి. ఉద్యోగులు ప్రాజెక్టుల్లో లేనప్పుడు బెంచ్ మీద గడిపే సమయాన్ని ఇది సంవత్సరానికి కేవలం 35 పని దినాలకు పరిమితం చేసింది. టీసీఎస్‌లోని సుమారు 6,00,000 మంది ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని పెంపొందించడానికి, నైపుణ్యాలు పునరుద్ధరించుకోవడానికి ఈ చొరవ ఎంతో మేలు చేస్తుందని కంపెనీ నమ్ముతోంది. అయితే నిన్నటితో మొదటి విడత బెంచ్ గడువు ముగియడంతో తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయోనని బెంచ్‌పై ఉన్న కొందరు ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: 34 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చు!
టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ ఈ చర్యను కంపెనీలో సహజ పరిణామంగా అభివర్ణించారు. ‘మేము ఇప్పటికే కొన్ని పాలసీలను క్రమబద్ధీకరించాం. ఉద్యోగులు ప్రాజెక్ట్‌కు సిద్ధంగా ఉండాలి. బిల్లింగ్ డేస్ పెరిగేలా చూడాలి. ఈ మేరకు తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు కంపెనీ సహాయం చేస్తోంది’ అని ఆయన ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా మూడు త్రైమాసికాల నుంచి కంపెనీ ఆదాయం వరుసగా క్షీణిస్తోంది. పెరుగుతున్న ఉద్యోగుల వ్యయం కొంత భారంగా మారుతుందనే వాదనలున్నాయి.