
దేశం వదిలి వెళ్లినవారు ఎంతో కొంత సంపాదించి కొంత ఆర్థిక స్వాతంత్ర్యం పొందిన తర్వాత తిరిగి స్వదేశానికి రావాలనుకుంటారు. 34 ఏళ్ల ఎన్ఆర్ఐ రూ.4 కోట్లు సంపాదించి భారత్‌కు తిరిగి వచ్చి త్వరగా రిటైర్ అవ్వాలని యోచిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. తన వద్ద రూ.4 కోట్లు ఉన్నాయని చెప్పారు. అందులో రూ.రెండు కోట్లు బ్యాంకు ఖాతాలో ఉందని, మరో రూ.రెండు కోట్లను రిటైర్మెంట్ కోసం పొదుపు చేయబోతున్నట్లు తెలిపారు. అయితే సోషల్‌మీడియా వేదికగా తనకు ఎవరైనా ఆర్థిక సలహా ఇవ్వమని కోరాడు. దాంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది.
పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘నేను ఇండియా వచ్చి రిటైర్ అయినా పార్ట్‌టైమ్‌గా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాను. నా భార్యకు నేను రిటైర్ అవ్వడం ఇష్టం లేదు. పీహెచ్‌డీ పూర్తికావడంతో భారత్‌లో నాకు మంచి ఉద్యోగమే వస్తుందని నమ్ముతున్నాను. నా పొదుపులో నుంచి ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటే మొత్తం ఖర్చులు కలిపి నెలకు సుమారు రూ.1లక్ష-రూ.1.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. నా వద్ద ఉన్న నిధులు సరిపోతాయా? అనే అనుమానం ఉంది. ఈ ఖర్చులను పరిగణించి దయచేసి రిటైర్మెంట్ ప్రణాళికలు సూచించండి’ అని కోరాడు.
ఇదీ చదవండి: 'సుకన్య సమృద్ధి' లాభదాయకమేనా?
‘మీరు త్వరగా పదవీ విరమణ చేసి భారతదేశానికి తిరిగి రావాలనుకుంటే అగ్రెసివ్ పెట్టుబడులు చేయవద్దు. నిధులు సరిపోతాయనే దిగులు వద్దు. అయితే మీ బడ్జెట్ విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలి. సుమారు 5-6% వడ్డీ సమకూరే ఎఫ్‌డీలో రూ.1 కోటి ఉంచండి. మీ బడ్జెట్ అంచనా నెలకు రూ.1లక్ష-రూ.1.5 లక్షలుగా ఉంది. లోయర్ టైర్ సిటీలో ఇంటి అద్దెలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్నేళ్ల పాటు అక్కడ ఉండండి. మరో రూ.3 కోట్లను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోకి మళ్లించేలా బ్యాలెన్స్‌డ్ స్టాక్ మార్కెట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి. కనీసం 5-6 సంవత్సరాల వరకు దీన్ని విత్‌డ్రా చేయకూడదు. దాంతో ఇది బాగా పెరుగుతుంది. మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కోగలదు. దాంతో నెలకు కనీసం రూ.లక్ష సమకూరుతుంది. దాంతోపాటు మీరు పెట్టిన కార్పస్‌పై ప్రభావం ఉండదు’ అని ఒక యూజర్ తెలిపారు.