
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్)లో పని చేసేందుకు మెటా కళ్లు చెదిరిపోయే ప్యాకేజీలను ప్రకటిస్తోంది. యాపిల్, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైండ్, ఆంత్రోపిక్..వంటి ప్రముఖ సంస్థలకు చెందిన ప్రపంచంలోని టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులను ఆకర్షించడమే లక్ష్యంగా రూ.800 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల పరిహార ప్యాకేజీలను అందిస్తోంది.
ఇటీవల మెటాలో చేరిన యాపిల్‌కు చెందిన రుమింగ్ పాంగ్‌కు రూ.1,600 కోట్లు (సుమారు 200 మిలియన్ డాలర్లు) పరిహార ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మెటా మాజీ ఓపెన్ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సాల్‌కు రూ.800 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఆఫర్ చేసినట్లు తెలిసింది. కంపెనీ ‘ఓ-సిరీస్’ మోడళ్లను సృష్టించడంలో బన్సాల్ ప్రముఖ పాత్ర పోషించారు. మెటా ఈ ప్యాకేజీలను ధ్రువీకరించనప్పటికీ వేతనం, పరిహార బోనస్‌లు, స్టాక్ గ్రాంట్లు కలిపి కొన్ని కంపెనీల సీఈఓలు సంపాదించే వేతనంతో సమానంగా, అంతకుమించి ఉన్నాయని తెలుస్తుంది.
ఇదీ చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలు
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్‌ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్‌పర్ట్‌లకు ఎంత ప్యాకేజీ చెల్లించేందుకైనా వెనుకాడడం లేదని సమాచారం.