
దేశవ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ లావాదేవీలను డిజిటల్ చెల్లింపులు సులభతరం చేశాయి. వాడకం పెరిగే కొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల వినియోగదారుల్లో అవగాహన కూడా పెరగాల్సి ఉంది. సురక్షితమైన చెల్లింపు విధానాలను పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇవి వినియోగదారులకు డిజిటల్ భద్రతను అందిస్తాయి. డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 5 జాగ్రత్తలను సూచిస్తోంది.
లావాదేవీ ముందే సరిచూసుకోవడం..
ఏదైనా డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్‌పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయాలి. మీరు ఎవరికైతే డబ్బు పంపిస్తున్నారో వారి పేరే స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలి. దీనికి పెద్దగా సమయం కూడా పట్టదు. తొందరపడి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి.
ఆథరైజ్డ్ యాప్‌లు, వెబ్‌సైట్లే వాడేలా..
ఎప్పుడూ అధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. తెలియని వారు, లేదా మరేదైనా వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా లింకుల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసి లావాదేవీలు చేయవద్దు.
గోప్యంగా ఓటీపీ
యూపీఐ పిన్ లేదా మెయిల్, ఫోన్‌కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్), లేదా బ్యాంక్ వివరాలు అత్యంత గోప్యమైనవని గమనించాలి. ఈ వివరాలు బ్యాంకువారు కూడా అడగరని గుర్తించాలి. బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, లేదా పోలీసులం, లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారం అని ఎవరైనా ఆయా వివరాలు అడిగితే స్కామర్లని వెంటనే తెలుసుకుని ఫిర్యాదు చేయాల్సి.
హడావిడి పేమెంట్లు వద్దు..
వెంటనే పేమెంట్ చేయాలని లేదా మీ వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే కంగారుపడకండి. కాస్త సమయం తీసుకోండి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పండి. మీకు కావాల్సినంత సమయం తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.
ఇదీ చదవండి: లక్షల మందిని ఊచకోత కోసి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
పేమెంట్ అలర్ట్‌లను ఆన్ చేసుకోవడం..
మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన ఎస్ఎంఎస్, యాప్ నోటిఫికేషన్‌లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచండి. ప్రతి అలర్ట్‌ను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్‌ను సంప్రదించండి.